మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కొత్త డ్రామాలు!

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కొత్త డ్రామాలు!

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ,బీజేపీ  కొత్త డ్రామాకు తెరలేపాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రజల వద్దకు వెళ్లేందుకు మండలాల వారీగా ఇన్ ఛార్జ్ లతో జూమ్ లో డిస్కషన్ చేసి వారికి దిశానిర్దేశం చేశామన్నారు.  పార్టీ ఫిరాయింపుల కమిటీలు వేసి మునుగోడులో చేరికలు జరుగుతున్నాయన్నారు.కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన సర్పంచ్, ఎంపీపీ, ZPTC లకు నజరానాలు ఇచ్చి టీఆర్ఎస్, బీజేపీ కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు. దశాబ్దాల కాలంగా పదవులు అనుభవించి స్వప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారన్నారు. పార్టీ వీడే సమయంలో అధినాయకత్వం పై విమర్శలు చేయడం సరికాదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. 

టీఆర్ఎస్,బీజేపీ రెండూ ఒకటే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. సాగునీటి విషయంలో పాలమూరును కేంద్ర రాష్ట్రాలు మోసం చేశాయని విమర్శించారు. మునుగోడులో సమస్యలపై చర్చకు రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని..కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో భూములు కొల్లగొట్టేందుకు  రాష్ట్ర సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 

రాష్ట్రం రైతులను పట్టించుకోరా..?

రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి రైతుల సమస్యలను పట్టించుకోని సీఎం..ఇతర రాష్ట్రాల రైతులకు పరిహారం ఇస్తారని చెప్పారు. రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతుందన్నారు.  ఈ సమస్యలు పట్టించుకోని కేసీఆర్..బిహార్ లో కార్మికులకు సాయం  చేస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడే దిక్కులేదు..దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తారా..? ఎద్దేశా చేశారు. మన కార్మికులు, రైతులు, జవాన్లను పట్టించుకోకుండా..కేసీఆర్ గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మోడల్ అంటే టెండర్లు ఇచ్చుడు..కమీషన్లు గుంజుడేనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.