కేసీఆర్​ను వ్యతిరేకించెటోళ్లందరూ కాంగ్రెస్​లోకి రండి : రేవంత్ 

కేసీఆర్​ను వ్యతిరేకించెటోళ్లందరూ కాంగ్రెస్​లోకి రండి
బీఆర్ఎస్​ను ఓడించుడు బీజేపీతోని కాదు: రేవంత్ 
ఆ రెండూ ఒక్క తాను ముక్కలే.. మోడీ, కేసీఆర్ బ్రాండ్లకు కాలం చెల్లింది 
కేసీఆర్​కు ఓటమి భయం.. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓడిపోతారని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విషయం సీఎం కేసీఆర్​కు అర్థమైందని, అందుకే ఓటమి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్​ను ఓడించేందుకు కేసీఆర్ ను వ్యతిరేకించెటోళ్లందరూ కాంగ్రెస్ తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రాభివృద్ధి కోరుకునేటోళ్లు కాంగ్రెస్​తో కలిసి నడవాలి. కాంగ్రెస్​కు నేను నాయకుడిని కాదు. సోనియా, ఖర్గేనే పార్టీ నాయకులు” అని అన్నారు. 

తన వల్ల ఇబ్బంది అవుతుందనుకుంటే ఒకటి కాదు.. పది మెట్లు దిగేందుకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గురువారం గాంధీభవన్​లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ను ఓడించడం బీజేపీతో సాధ్యం కాదని ఆయన కామెంట్ చేశారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్.. మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదు. అంతా ఒక్క తాను ముక్కలే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్​విడిపోయినట్టుగా నాటకం ఆడుతున్నాయి” అని అన్నారు. ‘‘కర్నాటకలో కాంగ్రెస్​గెలుపును పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్​ఎల్పీ మీటింగ్​లో కేసీఆర్​ అన్నారు. ఆ ఎన్నికలు ఇక్కడ ప్రభావం చూపవని చెప్పారు. సరిగ్గా నాలుగు రోజుల కింద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కూడా ఇదే మాట అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఓటమిని గుర్తించేందుకు కేసీఆర్​కు మనసొప్పడం లేదు” అని మండిపడ్డారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నట్టుగానే, ఇక్కడ కేసీఆర్​కూడా కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం రూ.200 కోట్లతో వేరే రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్​ఖాతాలో ఉన్న రూ.1,300 కోట్ల నుంచి అడ్వర్టయిజ్​మెంట్లు ఇచ్చుకోవచ్చు కదా!’’ అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవే చివరి అవతరణ వేడుకలని, ఆ తర్వాత కాంగ్రెస్​సర్కార్ హయాంలోనే అవతరణ వేడుకలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. 

కర్నాటకలో కేసీఆర్ నడ్డి విరిచే తీర్పు.. 

కర్నాటక ప్రజలు కేసీఆర్​నడ్డి విరిచే తీర్పు ఇచ్చారని రేవంత్ అన్నారు. ‘‘బీజేపీని గెలిపించేందుకు జేడీఎస్​తో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. కర్నాటకలో హంగ్​తీసుకొచ్చి చక్రం తిప్పాలని అనుకున్నారు” అని ఆరోపించారు. దేశంలో మోడీ బ్రాండ్​కు, రాష్ట్రంలో కేసీఆర్ బ్రాండ్​కు కాలం చెల్లిందని కామెంట్ చేశారు. ‘‘ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగినా పట్టించుకోకుండా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్​షాలు కర్నాటక ఎన్నికలపైనే ఫోకస్​ పెట్టారు. బజరంగ్ బలి, హిజాబ్ వంటి అంశాలతో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. లింగాయత్​ల మధ్య కుల చిచ్చు రాజేసి గెలిచేందుకు ప్రయత్నించారు. ఎన్ని చేసినా మా గెలుపును ఆపలేకపోయారు. మా గెలుపును మా పార్టీ బద్ధ శత్రువులు కూడా అభినందిస్తున్నారు. బీజేపీని దించడం కాంగ్రెస్​తోనే సాధ్యమని పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ లాంటి వాళ్లు నమ్ముతున్నారు” అని చెప్పారు.  

త్వరలో బీసీ డిక్లరేషన్.. 

బీజేపీకి బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అని రేవంత్​ప్రశ్నించారు. అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్సేనని తెలిపారు. ‘‘వీపీ సింగ్​హయాంలో మండల్ కమిషన్​నివేదిక ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే, దానికి వ్యతిరేకంగా కమాండల్​పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది బీజేపీ కాదా? బీసీ జనాభాను లెక్కించేందుకు కాంగ్రెస్ స్పష్టమైన విధానం తీసుకొస్తే, దాన్ని అడ్డకుంటున్నది బీజేపీ కాదా?” అని ప్రశ్నించారు. మోడీకి తన పదవి పోయేముందు బీసీలు గుర్తొచ్చారా? అని మండిపడ్డారు. బీసీల కోసం ఏం చేయబోతున్నామో త్వరలోనే బీసీ డిక్లరేషన్​ద్వారా వెల్లడిస్తామని ప్రకటించారు. 

హరీశ్ ​గట్టెక్కుతడు.. 

ప్రెస్ మీట్ తర్వాత మీడియాతో రేవంత్ చిట్ చాట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్​ఓడిపోతారని ఆయన కామెంట్ చేశారు. ‘‘సీఎంలే ఓడిపోయారు. ఎన్టీఆర్, సిద్ధరామయ్య లాంటి వాళ్లకూ ఓటమి తప్పలేదు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కేటీఆర్ ​ఓడిపోతారు. ఆయన ఓడిపోకపోతే ప్రజల కోపానికి అర్థం ఉండదు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, హరీశ్​రావు గట్టెక్కుతారు. మంచి క్యాండిడేట్​ను నిలబెడితే ఎర్రబెల్లి కూడా ఓడిపోతారు” అని అన్నారు. తనకు కాంగ్రెస్ నుంచి మిస్డ్​కాల్స్​ వస్తున్నాయన్న షర్మిల కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘మా ఫోన్లలో బ్యాలెన్స్​ లేదు. అందుకే మిస్డ్​కాల్స్​ ఇస్తున్నాం” అని సెటైర్ వేశారు.