పార్టీలు మార్చే కేసీఆర్ ను ప్రజలెవరూ నమ్మరు : రేవంత్ రెడ్డి

నిజామాబాద్ : బీఆర్ఎస్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.. త్వరలో వీఆర్ఎస్ కాబోతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలు మార్చే కేసీఆర్ ను ప్రజలెవరూ నమ్మరని చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టేందుకే రంగులు, పార్టీల పేర్లు మారుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. ఎమ్మెల్సీకవితకు నిజామాబాద్ లో ఓటర్లు ఎలా బుద్ధి చెప్పారో..రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా కేసీఆర్ కు అలానే బుద్ధి చెబుతారని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రలో జనం పట్టం కట్టబోతున్నారని చెప్పారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ తన తాత్కాలిక ప్రయోజనాల కోసం మాట్లాడుతారని రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లచట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టిన్నప్పుడు కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. తామంతా పోరాటం చేసిన సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని అన్నారు. ముందుగా రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని, ధరణితో 25 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ముందు ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంటబీమా పథకం అమలు చేయడం లేదని, చెరుకు ఫ్యాక్టరీని పున: ప్రారంభిస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సాయం పొందాలంటే రైతు చచ్చిపోవాలా..? అని ప్రశ్నించారు. రైతుబీమా గురించి గొప్పలు చెప్పుకోవడం ఎందుకన్నారు. 80 వేల మందికి రైతు బీమా ఇచ్చానని కేసీఆర్ చెబుతున్నారని, 8 వేల మంది మాత్రమే చనిపోయారని ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయని అన్నారు. ఒక లక్షా 50 వేల మంది రైతులను కేసీఆర్ పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అందర్నీ ఢిల్లీకి పిలిచి.. ఎమ్మెల్సీ కవితను మాత్రం వారి ఇంట్లో విచారిస్తారట అంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ఆప్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కాంగ్రెస్ ను లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆకలి సూచికలో ఇండియా 108వ స్థానంలో ఉన్నందున బీజేపీ ఓట్లు అడుగుతుందా..? అని ప్రశ్నించారు. అభివృద్ధి నమూనా బీజేపీ దగ్గర ఏముందని ప్రశ్నించారు. ‘నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్ ఇచ్చిండు.. మోడీ బోర్డే ఇవ్వలేదు. ఇప్పటికీ పసుపు బోర్డు ఎక్కడ..?’ అని ప్రశ్నించారు.