ఎనిమిదేళ్లు ప్రధానిగా మోడీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటూ.. మునుగోడు ప్రజల సమస్యలను పరిష్కరించలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు కడుతానన్న కేసీఆర్ ఇటువైపు ఎందుకు చూడడం లేదని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు బయటికొచ్చారని అన్నారు. తాగడానికి గంజి లేని టీఆర్ఎస్ వాళ్లు ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. మంత్రులే స్వయంగా విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పని చేసిన నాయకులు నీతి, నిజాయితీగా పని చేశారని, 40 ఏళ్లుగా అదే నిజాయితీతో పని చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ మంత్రులే మద్యం పోస్తున్నారంటే.. ఇంతకంటే దివాలకోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు.
మునుగోడు నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తారని పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉప ఎన్నిక సందర్భంగా తాము మద్యం సీసాలను, డబ్బులను పంచమని, ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసే కాంగ్రెస్ చేయదని చెప్పారు. ఈ సారి ఆడబిడ్డ పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వాలని మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు నుంచే మార్పునకు శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డి కోరారు.