అధికారంలోకి వస్తే రైతుబంధు 15 వేలు
కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తం : రేవంత్
రేపు ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ
హాజరుకానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
సభకు వచ్చే వాళ్లను అడ్డుకుంటే తొక్కుకుంటూ వస్తరు
ఖమ్మంకు భట్టి, రేణుక రెండు కండ్లైతే... పొంగులేటి మూడోకన్ను
భట్టి పాదయాత్ర అంశాలను మేనిఫెస్టోలో పెడ్తామని వెల్లడి
ఖమ్మం కార్పొరేషన్/ ఖమ్మం రూరల్, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి అన్నారు. అలాగే రైతు బంధు ఏటా ఎకరానికి రూ.15వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా రూ.12వేలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. శుక్రవారం రేవంత్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో, తెలంగాణ జనగర్జన సభ ప్రాంగణం పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఖమ్మంలో ఆదివారం భారీ బహిరంగసభ నిర్వహించి తీరుతామని చెప్పారు. సభను అడ్డుకోవాలని చూస్తే అడ్డం వచ్చిన వాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు, పొగులేటి అభిమానులు తొక్కుకుంటూ వస్తారని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ కలిగిస్తున్న భ్రమలు, మోసాలను భట్టి తన పాదయాత్రలో ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. ఈ పాదయాత్రలో గమనించిన సమస్యలు, అంశాలను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు.
ఎన్నికల శంఖం పూరిస్తం
పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లో చేరాల్సిందిగా గతంలోనే కోరానని, తనకు కొంత సమయం కావాలని ఆయన అడిగారని రేవంత్ చెప్పారు. ఆయన ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుని కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జులై 2న(ఆదివారం) ఖమ్మంలో నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన సభకు హాజరవుతామని రాహుల్‌గాంధీ , మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారని చెప్పారు. ఈ వేదిక మీద నుంచే ఎన్నికల శంఖం పూరిస్తామన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం రోజున కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాకు భట్టి, రేణుకాచౌదరి రెండు కండ్లయితే, పొంగులేటి మూడోకన్ను లాంటివారన్నారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలిసిందేనని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్నారు.మీడి యా సమావేశంలో ఏఐసీసీ ప్రచార కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, పొదెం వీరయ్య, సీతక్క, మహేశ్‌కుమార్ గౌడ్, బలరాంనాయక్, మల్లు రవి, పిడమర్తి రవి, మానవతా రాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తి కాదు : పొంగులేటి
జనగర్జన సభకు ఆర్టీసీ బస్సులు కేటాయించకపోయినా విజయవంతమవుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్టీసీ కల్వకుంట్ల ఫ్యామిలీకి వాళ్ల తాత రాసిచ్చిన ఆస్తి కాదన్నారు. ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిపోల నుంచి 1500 బస్సులు కావాలని కోరితే అధికారులు అంగీకరించారు. అందుకు రూ.కోటి 90లక్షలు కట్టాలని చెప్పారు. డబ్బులు కట్టడానికి వెళ్తే బస్సులు ఇవ్వలేన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ కొడుకు రాహుల్వస్తుంటే బస్సులు ఇవ్వకపోవడం మీ సంస్కృతికి అద్దం పడుతున్నది” అని అన్నారు.