కాంగ్రెస్ పార్టీని చంపేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి 3వ స్థానం వస్తుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. సర్వే ఫలితాలు చూసి రాజగోపాల్ రెడ్డికి జ్వరం వచ్చిందని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. బీజేపీ గెలవలేదని తెలిసే రాజగోపాల్ కేంద్ర బలగాలను మునుగోడుకు తీసుకొచ్చి.. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీపైనా రేవంత్ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి 8ఏండ్లు గడిచినా మునుగోడులోని గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్.. చివరకు యువకులను మద్యానికి బానిసలుగా మార్చారని మండిపడ్డారు.
డిండి ప్రాజెక్టును పూర్తి చేయలేరు: రేవంత్
మునుగోడును అభివృద్ధి చేయాలనుకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని.. అసలు మునుగోడును అభివృద్ధి చేయాలనే ఆలోచన టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంకో ఎనిమిదేళ్లయినా డిండి ప్రాజెక్టును పూర్తి చేయలేరని విమర్శించారు. గిరిజనుల భూములను సినిమా వాళ్లకు కట్టబెట్టాలని కేటీఆర్ చూస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. గిరిజనులను అనాధలను చేయాలనే కుట్ర జరుగుతోందని.. అసలు వారి సమస్యలు చర్చకు రాకుండా బీజేపీ, టీఆర్ఎస్ లు గందరగోళం సృష్టిస్తున్నాయని రేవంత్ అన్నారు. మద్యం, డబ్బుల ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
ఈనెల 30న రాహుల్ భారత్ జోడో యాత్ర
ఈనెల 30న మధ్యాహ్నం 3గంటలకు భారత్ జోడో యాత్ర షాద్ నగర్ కు చేరుకుంటుందని కాంగ్రెస్ కార్యకర్తలంతా తరలివచ్చి రాహుల్ యాత్రను విజయవంతం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక ప్రచారానికి చివరి రోజైన నవంబర్ 1న మునుగోడులో మహిళా గర్జన సభ నిర్వహిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సభకు తరలివచ్చి పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.