బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటిగానే కుట్రలు.. ఇవిగో సాక్ష్యాలు : రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటిగానే కుట్రలు.. ఇవిగో సాక్ష్యాలు : రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని.. రెండు పార్టీలు ఒక్కటై.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయంటూ.. సాక్ష్యాలు, ఆధారాలతో ప్రజలకు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2023, నవంబర్ 24వ తేదీ ఈ మేరకు ఆయన ప్రజల దృష్టికి కొన్ని అంశాలను తీసుకొచ్చారు. 

తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదు.. ప్రశ్నించే గొంతులే ఉండరాదన్న నియంతృత్వ పోకడలతో బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని.. ఆ రెండు పార్టీల్లో చేరిన వారు పవిత్రులు.. కాంగ్రెస్ పార్టీలో చేరితే ద్రోహులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కుదిరిన కామన్ మినిమమ్మ ప్రోగ్రాంలో భాగంగానే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తు్న్నారని మండిపడ్డారాయన. బీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పని చేస్తుందని.. ఇద్దరూ అనుకునే కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఇందులోనే భాగంగానే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వివేక్ వెంకటస్వామిపైనా ఈడీ దాడులు చేయించారంటూ లేఖ ద్వారా ప్రజలకు వివరించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తెలిసిన తర్వాతే.. దాడులు పెరిగిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారాయన.  

 

కేసీఆర్, అమిత్ షా రచించిన ప్రణాళికను.. పియూష్ గోయల్, కేటీఆర్ అమలు చేస్తున్నారని.. ప్రతి రోజూ సూర్యుడు అస్తమించగానే.. వీళ్ల కుట్రలకు రచన జరుగుతుందని.. అర్థరాత్రులు ఇళ్లపై దాడులు చేయటం ఏంటని నిలదీస్తూనే.. ఈ విషయాలను తెలంగాణ సమాజం తెలుసుకోవాలని విజ్ణప్తి చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు వందల కోట్లు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఎందుకు వెళ్లటం లేదని.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినా ఆ సంస్థలు.. కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు రేవంత్ రెడ్డి. 

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామి, పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ, ఈడీ దాడులు చేయటం వెనక కుట్ర ఉందన్నారు రేవంత్ రెడ్డి. పోటీ చేస్తున్న అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదా అని ప్రశ్నించారాయన. బీఆర్ఎస్, బీజేపీ పతనం మొదలైందని.. కుట్ర రాజకీయాలకు కాలం చెల్లిందని హెచ్చరించారాయన. మీ కవ్వింపు చర్యలు, కుట్ర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయని.. వివేక్ వెంటకస్వామి కుటుంబంపై దాడిని.. కాంగ్రెస్ పార్టీపై దాడిగానే భావిస్తామని బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు రేవంత్ రెడ్డి. 

ఎన్ని ఇబ్బందులు, కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని.. తెలంగాణ ప్రజల విజయాన్ని ఆపలేరన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.