తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు .. జారీ చేసిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు .. జారీ చేసిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు
  • ఈ నెల  12లోపు వివరణ ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం పీసీసీ క్రమ శిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి పేరుతో ఈ నోటీసు జారీ అయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీన్మార్​ మల్లన్న పాల్పడుతున్నారని అందులో పేర్కొంది.  ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కమిటీ హెచ్చరించింది. ‘‘మీరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ హైకమాండ్​ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు పరుష పదజాలంతో మాట్లాడుతున్నరు. 

బీసీల మనోభావాలను దెబ్బతీసేలా కులగణన నివేదికను తగులబెట్టినట్లు  మీపై పీసీసీ క్రమ శిక్షణ కమిటీకి పలు ఫిర్యాదులు అందాయి. పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి, వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నరు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలి’’ అని షోకాజ్​ నోటీసులో ప్రశ్నించింది. కాగా, తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చే ముందు గాంధీభవన్ లో క్రమ శిక్షణ కమిటీ సమావేశమైంది.  కులగణన నివేదికకు వ్యతిరేకంగా మల్లన్న మాట్లాడిన తీరుపై చర్చించి, షోకాజ్​ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.