- మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ
- మొదట స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులతో సెగ్మెంట్ల వారీగా మీటింగ్స్
- ఆ తర్వాత సీఎం, ఏఐసీసీ నేతలతో జిల్లా స్థాయి సమావేశాలు
- గ్రామ స్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలని నేతలకు ఇప్పటికే ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే పీసీసీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో సాగనున్న ఈ సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఆ జిల్లాకు చెందిన మంత్రి, ముఖ్య నేతలు చీఫ్ గెస్టులుగా హాజరయ్యేలా పీసీసీ నాయకత్వం షెడ్యూల్ ను రెడీ చేస్తున్నది.
నియోజకవర్గస్థాయి సమావేశాల తర్వాత జిల్లా స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నది. జిల్లా స్థాయి మీటింగ్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు అటెండ్ అయ్యేలా పీసీసీ ప్రణాళిక రెడీ చేస్తున్నది. ఈలోపే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న ప్రధాన సమస్యలను స్థానిక నేతలు గుర్తించి వాటిని పీసీసీ దృష్టికి తీసుకురావాలని గాంధీ భవన్ నుంచి ఆయా జిల్లాల కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు వెళ్లాయి.
ఆరు గ్యారెంటీలతో జనంలోకి
సెప్టెంబర్ ఆఖరులో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడం.. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగే చాన్స్ ఉన్నందున మెజార్టీ పంచాయతీలను, మండల పరిషత్తులను, జిల్లా పరిషత్తులను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే పీసీసీ ప్రణాళికను తయారు చేస్తున్నది. పార్టీల రహితంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నప్పటికీ స్థానికంగా మాత్రం పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
అందుకే పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామాల్లోని పార్టీ లోకల్ లీడర్లను పంచాయతీ ఎన్నికల బరిలో నిలిపి వారిని గెలిపించుకునే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేకు అప్పగించనుంది. ఈలోపే పంచాయతీల వారీగా ఉన్న సమస్యలు అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయా నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యేలను పీసీసీ ఆదేశించింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీల పరంగా జరగనున్నాయి. వాటిలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా పంట రుణమాఫీ అ మలును ప్రతి పల్లెకు..ప్రతి గడపకు తీసుకెళ్లేలా గ్రామ, మండల స్థాయి కేడర్‌కు పీసీసీ తగిన ఆదేశాలు ఇచ్చిం ది. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు ప్రజా పాలనపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని పీసీసీ భావిస్తున్నది.