హైదరాబాద్, వెలుగు: బీజేపీ కుట్రలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేసిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకులను భయపెట్టడానికి, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా భయపెట్టడానికి నిరంతరం రెయిడ్స్ చేశారన్నారు. ఎన్ని దాడులు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. భవిష్యత్తులో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.