ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా రక్షణ .. ప్రజలకు నష్టం చేయదు: అద్దంకి దయాకర్

ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా రక్షణ .. ప్రజలకు నష్టం చేయదు: అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా కస్టోడియన్ గా ఉండి, వాటిని కాపాడుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ చెప్పారు. ప్రజల ఆస్తులను కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూడలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. ‘‘ఎవరికైనా నష్టం జరిగితే కింది స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఫిర్యాదు చేసుకోవచ్చు. 

చట్టపరంగా న్యాయం పొందొచ్చు. ప్రస్తుతం మూసీ సర్వే జరుగుతున్నది. కానీ ఇప్పుడే కూల్చివేతలు చేపట్టినట్టుగా కొంతమంది రాజకీయ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. ప్రజలకు నష్టం చేయాలనే  ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కొంతమంది వ్యక్తులు  ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు” అని మండిపడ్డారు.