నకిరేకల్, వెలుగు: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ పేదలకు న్యాయం జరుగుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. నకిరేకల్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేవెళ్లలో జరిగిన ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలచేసి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలను సాకారం చేస్తామన్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో గృహలక్ష్మి పేరుతో బీఆర్ఎస్ మరోమోసానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం భారీ మోసానికి తెరలేపిందని, ఆ పథకం అథికారం పార్టీ నాయకులకే బంధువు అయ్యిందని దుయ్యబట్టారు.
ఈ సమావేశంలో పీసీసీ ప్రతినిధి సుంకరబోయిన నర్సింహ యాదవ్, రాష్ట్ర నాయకులు చామల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ జటంగి రామనర్సయ్య, మాజీ సర్పంచ్ పన్నాల రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ లింగాల వెంకన్న, మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, రామన్నపేట పట్టణ అధ్యక్షుడు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు జమీరుద్దీన్ పాల్గొన్నారు.