- బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
- పీసీసీ నేత నిరంజన్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి పూరీ జగన్నాథుడు భక్తుడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతల అహంకారం ఏ స్థాయికి వెళ్లిందో దీనిబట్టి అర్థమవుతోందన్నారు. బుధవారం గాంధీ భవన్ లో నిరంజన్ మాట్లాడారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై పూరీ జగన్నాథుడి భక్తులు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
బీజేపీ నేతలు పూరీ భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కృష్ణుడిలా, రాముడిలా మోదీని భగవత్ స్వరూపం అని పిలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా మోదీ పేరిట ఆలయాలు నిర్మించి, దర్శనాలకు వెళ్లాలని ప్రజలకు చెప్పే ప్రయత్నాలు కూడా బీజేపీ నేతలు చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.