వర్కింగ్​ ప్రెసిడెంట్లు నలుగురు.. నేడో రేపో 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం..!

వర్కింగ్​ ప్రెసిడెంట్లు నలుగురు.. నేడో రేపో 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం..!
  • ఎస్సీ, ఎస్టీ, రెడ్డి,మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసీసీ
  • 20 మందికిపైగా వైస్ ప్రెసిడెంట్లు
  • నేడో రేపో 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం
  • పార్టీ జనరల్​ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్టే!
  • దేశవ్యాప్తంగా ఒకే సారి జిల్లా అధ్యక్షుల నియామకం


న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త కార్యవర్గం ఫైనల్​అయింది. సుమారు 25 మందితో లిస్ట్ రెడీ అయినట్లు తెలిసింది. నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, 20మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. ఫైనల్​జాబితాను ఒకటీ రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం ప్రకటించనున్నట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త కార్యవర్గం కోసం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతల నుంచి పలువురి పేర్లను తీసుకున్నారు. 

ఈ జాబితాలోని పేర్లకు ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్రవేయగానే.. కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. ఇప్పటి వరకు పీసీసీలో ఒకే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్​ఉండగా.. రాష్ట్ర నేతల సూచనలతో ఆ సంఖ్యను నాలుగుకు పెంచారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి చాన్స్​ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే.. పీసీసీ చీఫ్ పోస్టులో బీసీ సామాజికవర్గానికి చెందిన లీడర్​ఉండటంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి బీసీల నుంచి ఎవర్నీ తీసుకునే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతున్నది. 

ఒక్కో వర్గం నుంచి ముగ్గురు చొప్పున..!

నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం..  ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ వర్గాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది పేర్లను రాష్ట్ర నేతలు అధిష్టానానికి అందజేశారు. దీంతోపాటు 15  నుంచి  20 మంది పేర్లను పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవులకు సూచించినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పదవులను ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదని తెలిసింది. అయితే.. జిల్లా అధ్యక్షుల విషయంలో అధిష్టానం కొత్త ప్రయోగం చేయబోతున్నది. దేశవ్యాప్తంగా ఒకే సారి జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులోనే తెలంగాణలోని జిల్లా అధ్యక్షుల పేర్లు ఉంటాయని కాంగ్రెస్​ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.