
- 24న రెండు సభలకు పీసీసీ ప్లాన్
- ఒకటి కరీంనగర్లో.. రెండోది మెదక్ లేదా నిజామాబాద్‌లో!
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సిట్టింగ్ సీటైన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను చాలెంజ్‌గా తీసుకున్నారు. మూడు రోజులుగా నియోజకవర్గ పరిధిలోని 4 ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్చార్జ్ మంత్రు లు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వ హిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి.. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో పాటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నుంచి గట్టిపోటీ ఎదురవుతున్నది.
రెండు జాతీయ పార్టీలు రెడ్డిలకు టికెట్లు ఇవ్వడంతో.. బీఎస్పీ తరఫున బరిలో నిలిచిన హరికృష్ణకు బడుగు, బలహీన వర్గాల మద్దతు లభిస్తున్నట్లు సీఎం రేవంత్‌కు ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందడంతో ఆయన ఈ ఎన్నికపై అప్రమత్తం అయ్యారు. అందుకే నేరుగా తానే ప్రచారంలో దిగాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ వచ్చారు. ఈ నేపథ్యంలో 24 న రెండు సభలు నిర్వహించేలా పీసీసీ ప్లాన్ చేసింది. ఒకటి కరీంనగర్ లో ఏర్పాటు చేయనుండగా, రెండో సభ మెదక్ లేదా నిజామాబాద్ లో నిర్వహించే ఆలోచనలో పీసీసీ ఉన్నది. అయితే దీనిపై శనివారం సీఎం ఆఫీసు నుంచి క్లారిటీ రానున్నట్లు సమాచారం.