నేను ఎప్పటికైనా పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ అవుతా

నేను ఎప్పటికైనా పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ అవుతా
  • బీసీకి ఇవ్వాలని మహేశ్‌‌‌‌‌‌‌‌కు హైకమాండ్‌‌‌‌‌‌‌‌  పదవి ఇచ్చింది: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హైకమాండ్ బీసీ నేతకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో మహేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్ గౌడ్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన చిట్ చాట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చాలా మంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడ్డారని, అయితే, బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మహేశ్‌‌‌‌‌‌‌‌కు ఆ పదవి దక్కిందని చెప్పారు. పార్టీ లైన్‌‌‌‌‌‌‌‌లోనే పనిచేసిన నేత మహేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్ గౌడ్ అని, ఆయన అందరిని కలుపుకొని పోతారని భావిస్తున్నానన్నారు.

తాను కూడా పీసీసీ కావాలనుకున్నానని, ఎప్పటికైనా అవుతానని అన్నారు. కాంగ్రెస్ పెద్ద పార్టీ అని, ఎవరైనా.. ఏదైనా కావొచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను హ్యాపీగా ఉన్నానని చెప్పారు. బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్నా కష్టమేనని, ఎవరికి వస్తదో.. ఎప్పుడు పోతదో తెలీదన్నారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని, అందులో పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీసీ నేతను పీసీసీ చీఫ్ చేసిందని, దమ్ముంటే కేసీఆర్ తన పదవిని బీసీకి ఇస్తాడా అని ప్రశ్నించారు. తనకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.