
- మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు లోబడే ట్రీట్మెంట్ చేయాలి: మహేశ్ గౌడ్
- శిక్షణ సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వంతో మాట్లాడుతా: ఎమ్మెల్సీ కోదండరాం
- ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ
ముషీరాబాద్, వెలుగు: ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. అయితే, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు లోబడే పనిచేయాలని ఆయన వారికి సూచించారు. తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ‘హలో ఆర్ఎంపీ.. చలో హైదరాబాద్’ పేరుతో గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో చొప్పరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సభకు ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే.. పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాలూ సమానమేనని చెప్పారు.
బేషజాలు లేకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీల ప్రాథమిక వైద్యం అవసరం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయారిటీ.. రైతులతో పాటు విద్య, వైద్యమేనని ఆయన పేర్కొన్నారు.
ఆర్ఎంపీల సమస్యలపై సీఎం సానుకూలం: కోదండరాం
ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలపై వైద్య శాఖ మంత్రితో సానుకూలంగా చర్చలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. సీఎం కూడా వారి సమస్యలపై సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి అభివృద్ధి చేస్తే గ్రామస్థాయిలో ప్రాథమిక వైద్యం అందుతుందన్నారు. వారి సమస్యలు పరిష్కారం ఒక పద్ధతిలో వెళ్తుందన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ప్రతిసారి ముఖ్యమంత్రి చెపుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శిక్షణ పొందిన 13 వేల మంది కమ్యూనిటీ పారా మెడికోస్కు సర్టిఫికెట్స్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సభలో విజ్ఞాన దర్శిని రమేశ్, గోవిందరెడ్డి, బాల బ్రహ్మచారి, వెంకటరెడ్డి, అశోక్, మోహన్, బాల్ రాజ్, భాస్కర్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి ఆర్ఎంపీ, పీఎంపీలు భారీగా తరలివచ్చారు.