డిసెంబర్ 21న నిరుద్యోగులతో కృతజ్ఞత సభ : పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పన్నెండేళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను నిర్వహించిన ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞత చెబుతూ నిరుద్యోగుల తరఫున వచ్చే నెల 21న ఓయూలో కృతజ్ఞత సభను నిర్వహించనున్నట్లు పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ చెప్పారు. ప్రజా పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల భవిష్యత్తు కోసం తపన పడుతున్నారని తెలిపారు. కేవలం పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటున్నదన్నారు. ఈ కృతజ్ఞత సభకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారని చెప్పారు.