- కాంగ్రెస్ నేత చనగాని దయాకర్
హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతుంది బాధితులు కాదని, ప్రతిపక్షాలు మాత్రమేనని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. వారు ఎన్ని కుట్రలు చేసినా మూసీ ప్రక్షాళన ఆగదని స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మూసీకి నల్గొండ ఉమ్మడి జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని, ఇప్పుడు ఈ నది ప్రక్షాళనతో ఆ జిల్లా తలరాతే మారనుందన్నారు. మూసీ మురికిపై పదేండ్లలో ఏనాడైనా కేటీఆర్ మాట్లాడారా అని ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళనకు అడ్డుపడే పార్టీలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూసీపై బీఆర్ఎస్, బీజేపీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. మూసీ అభివృద్ధితో ఉమ్మడి నల్గొండతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు ఈ నది ప్రాణవనరుగా మారనుందన్నారు.