అవుట్​ సోర్సింగ్​ ఏజెన్సీలను రద్దు చేయాలి : మానవతారాయ్

ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం హక్కులను కాపాడుతుందని, బంధించబోదని పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవుట్​సోర్సింగ్​ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. మానవతారాయ్​ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో అవుట్​సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థలు లేకుండా చేస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారంలో ఉన్న పదేండ్లు ఆ హామీని విస్మరించారని మండిపడ్డారు. పైగా కేసీఆరే తన స్వార్థం కోసం అవుట్​సోర్సింగ్​ఏజెన్సీలను పెంచి పోషించారని విమర్శించారు. 

బీఆర్ఎస్​నాయకులు, ప్రజాప్రతినిధులు బినామీ ఏజెన్సీలను సృష్టించి అవుట్​సోర్సింగ్​ఉద్యోగుల శ్రమ దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. అవుట్​సోర్సింగ్​ఏజెన్సీలను రద్దు చేసినప్పుడే అందులోని ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దాదాపు 2 లక్షల మంది అవుట్​సోర్సింగ్ ఉద్యోగులను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఆహార భద్రత కల్పించి, పే స్కేల్ వర్తింపజేయాలని సీఎం రేవంత్​ను కోరుతామన్నారు. జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు పులి లక్ష్మయ్య, బొల్లం గోవర్ధన్ మాట్లాడుతూ.. ఏజెన్సీ విధానాలను రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఏటా వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ కల్పించాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్ లో వెయిటేజ్ మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంతోష్ కుమార్, విజయలక్ష్మి, సంధ్య, శ్రీధర్, జయకృష్ణ, జగదీష్, అరుణ్ కుమార్, బిందు ప్రసాద్, నారాయణ, సురేందర్, సునీత తదితరులు పాల్గొన్నారు.