ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని ..పర్యాటక కేంద్రంగా మారుస్తాం : వెడ్మ బొజ్జు పటేల్

కడెం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖానాపూర్​నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్​లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టో కరపత్రాలను నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 9 ఏండ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు సేవలందిస్తామన్నారు. కడెం ప్రాజెక్ట్ ను ఆధునీకరిస్తామని, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఆయకట్టు వరకు రైతులకు సాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు. పోరాటాల గడ్డ ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద స్మారక వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సదర్మాట్, పోనకల్ బ్యారేజ్​కు కెనాల్​ను నిర్మించి పొలాలకు నీరు అందిస్తామన్నారు. 

మండలంలోని మారుమూల గ్రామీణ ప్రజల కోసం మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఖానాపూర్ లో ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్ముల మల్లేశ్ యాదవ్,  నాయకులు వాజిద్ ఖాన్, ఎం.రాజు, భూమన్న, సుధాకర్, రాజేశ్వర్​తో పాటు తదితరులు ఉన్నారు.