- దానికి నాయకుడు కేటీఆర్: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం ముఠా అని.. కేటీఆర్ దానికి నాయకుడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘సీఎం రేవంత్ ను హౌలా అంటావా.. అలాంటి మాటలు మాట్లాడితే నువ్వే ఓ బేవకూఫ్’’ అని మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ నాలుకకు నరం లేదని, ఆయన బుర్రకు తెలివిలేదని ధ్వజమెత్తారు.
కేటీఆర్ వలె అయ్య పేరు చెప్పుకొని రేవంత్ సీఎం కాలేదన్నారు. కేటీఆర్ నాజుగ్గా పెరిగాడని, రేవంత్ లెక్క డక్కా మొక్కీలు తినలేదని, రేవంత్ నాటుకోడి అయితే.. కేటీఆర్ బాయిలర్ కోడని ఎద్దేవా చేశారు. మూసీ పుట్టిన చోట నేవీ రాడార్ కు శంకుస్థాపన చేశారని కేటీఆర్ అనడంలో అర్థం లేదన్నారు. జీవో ఇచ్చింది మీరే కదా, మరి అప్పుడు గుర్తు లేదా? అని ప్రశ్నించారు.
రేవంత్ పై విమర్శలు చేస్తున్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. ఇతర రాష్ట్రాల ఎన్నికలకు కేసీఆర్ డబ్బు పంపించింది మరిచిపోయారా? అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేసే విమర్శలకు తాము తిరిగి ఎదురుదాడి చేయడం లేదని తమాషా చేస్తున్నారా అని మండిపడ్డారు. దామగుండం నేవీ రాడార్ విషయంలో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చిన్నపిల్లాడిలా ఉందని ఎద్దేవా చేశారు.