- అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పాటించలే: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రొటోకాల్ గురించి కేటీఆర్, హరీశ్‌రావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రొటోకాల్ పాటించని వారికి ఇప్పుడు ప్రొటోకాల్ గురించి అడగే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో కేటీఆర్, హరీశ్ ప్రొటోకాల్ పాటించారా అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన చేతిలో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతతో శంకుస్థాపనలు చేయించలేదా..? అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేసింది మర్చిపోయారా.. రేవంత్, సీతక్కలను సెక్రటేరియెట్ లోకి వెళ్లకుండా అడ్డుకోలేదా..? అని ప్రశ్నించారు.
ఇవన్నీ కేటీఆర్, హరీశ్ మరిచిపోతే వాళ్లు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందేనన్నారు. అప్పుడేమో చిలిపి చేష్టలు.. ఇప్పుడేమో వగలాడి మాటలా అని మండిపడ్డారు. కాంగ్రెస్ కు పాఠాలు చెప్పే వయసు మీది కాదు.. ఆ పరిపక్వత కూడా ఇంకా మీకు రాలేదన్నారు. ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రొటో కాల్ ఇచ్చారన్నారు. రాద్ధాంతం చేసి పరువు తీసుకోవద్దని సూచించారు.
ఇక ఈటల రాజేందర్ ప్రోగ్రామ్ కు వెళ్లకుండానే ప్రభుత్వంపై బురదజల్లే పని పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. ఇప్పటి రాజకీయాల్లో పార్టీలు మారడం మామూలేనని అది అంత సీరియస్ మ్యాటర్ కాదన్నారు. ఫిరాయింపులను ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. పాలిటిక్స్.. అత్తారిల్లు, తల్లిగారిల్లులా
మారిపోయాయన్నారు.