హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ పనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, పబ్లిసిటీకి తక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అదే బీఆర్ఎస్ అయితే పబ్లిసిటీకి దగ్గరగా ఉంటూ పనికి దూరంగా ఉంటుందని ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఆలోచన అంతా ప్రజలను ఎలా ఆదుకోవాలనే దానిపైనే ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షంగా ముందు సమస్యలు చెప్పి, తర్వాత పరిష్కారం అడగాలి కానీ.. ప్రతిపక్షం ఎలా ఉండాలో తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు.
తమకు ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఉంది కాబట్టి, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఎలా ఉండాలనేది తమను అడిగితే ట్రైనింగ్ ఇస్తామన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష నేత కేసీఆర్.. ఇంట్లో ఉండే తన పాత్రను నడిపిస్తున్నారని, గతంలో సీఎంగా కూడా ఆయన ఇంట్లో ఉండే పాలించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రధాని మోదీ మాట్లాడారని, రూ.7 వేల కోట్లు నష్టం జరిగినట్టు కేంద్రానికి సీఎం నివేదిక పంపారని చెప్పారు.
ప్రజల్లో విశ్వాసం నింపేలా సీఎం, మంత్రులు పని చేస్తున్నారని, కేంద్ర సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఖమ్మంకు వెళ్లడం తప్పు కాదని, అక్కడికి సమస్యలను సీఎం దృష్టికి తీసుకొస్తే మంచిదేనని, కానీ రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదన్నారు. ప్రభుత్వం.. ప్రతిపక్షం కలిసి ప్రజలను ఆదుకునే సమయన్నారు. హరీశ్ రావు, కల్వకుంట్ల కుటుంబం చంద్రబాబును ఎప్పుడు తిడతారో.. ఎప్పుడు పొగుడుతారో వారికే తెలియదని, తమను మెచ్చుకోలేక చంద్రబాబును మెచ్చుకుంటున్నారని చెప్పారు.