మా కార్యకర్తలను రెచ్చగొట్టి తన్నులు తినకండి ..బీఆర్ఎస్​ నేతలకు జగ్గారెడ్డి వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు తమపై దాడులకు దిగితే ప్రతి దాడులు పక్కాగా ఉంటాయని, తమ తడాఖా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

లగచర్ల ఘటనను మొదటి తప్పుగా వదిలేస్తున్నామని, ఇక ముందు అలాంటి తప్పులు చేసి, తమ కార్యకర్తలను రెచ్చగొట్టి తన్నులు తినొద్దని బీఆర్ఎస్ నేతలనుహెచ్చరించారు. రాజకీయ కుట్రలను తిప్పికొడుతాం.. సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. తమ మీద కేసులు పెట్టినా ఫర్వాలేదు కాని, దాడులకు ప్రతిదాడులు మాత్రం ఉంటాయన్నారు. చేస్తున్న మంచి పనులను.. చెడు పనులలా చూపించడంలో కేటీఆర్, హరీశ్ బిజీగా ఉన్నారని విమర్శించారు.