- అంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా గోలే
హైదరాబాద్, వెలుగు: భారీగా వర్షాలు కురుస్తున్నా.. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ట్విట్టర్ లో ఆయన కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖాతాల నుంచి ప్రకటనల మీద ప్రకటనలు విడుదల చేస్తున్నారు తప్ప బాధ్యతాయుతమైన నాయకుడిగా చెప్పుకునే కేటీఆర్ ఈ సంక్షోభ సమయంలో మైదానంలో కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
‘‘వారు (కేసీఆర్, కేటీఆర్) అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ గురించి పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. లేకపోతే రాష్ట్రాన్ని, ప్రజలను అంటరానివారిగా చూస్తారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వరదలపై పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన సిబ్బందిని మోహరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు’’అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.