నిజామాబాద్ : ఎన్నికల సందర్భంగా సమీక్షలు, సమావేశాలు పెట్టి ప్రజలను నమ్మించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా అలవాటు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రజలందరూ గమనించాలన్నారు. దేశంలోనే కేసీఆర్ అత్యంత ధనిక ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇస్తే తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు దేవాలయాలు, నిరుపేదలు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత రాష్ట్రానికి మహిళా యూనివర్సిటీని ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.658 కోట్ల నిధులతో నిజామాబాద్ నగరంలో ఏం అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నిజామాబాద్ కు పసుపుబోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్..ముందుగా ఇచ్చిన ఆ హామీపై దృష్టి పెట్టాలన్నారు. మాజీ మంత్రి రాజారాం ఇచ్చిన స్టేడియానికి కనీసం గోడ కూడా కట్టలేదని మండిపడ్డారు. కోట్ల నిధులతో నూతనంగా కలెక్టరేట్ కడితే.. వర్షాలు, వరదలతో నీటిలో మునిగిపోయిందన్నారు. జిల్లా కలెక్టరేట్ కు అధికారులు వెళ్లలేని పరిస్థితి తలెత్తిందన్నారు. త్వరలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టే.. తప్పుడు లెక్కలు చూపెడుతూ రోడ్లు, చెట్లు, సుందరీకరణ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధరణి స్కిమ్ తో అమాయక ప్రజలను, రైతులను మోసం చేశారని ఆరోపించారు. పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు మృతిచెందాడని చెప్పారు.