చైనా మాంజా అమ్మితే ఫోన్​ చేయండి : పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్

చైనా మాంజా అమ్మితే ఫోన్​ చేయండి : పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్
  • అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులతో పాటు పక్షులను ఎగురనిద్దామని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ పిలుపునిచ్చారు. గాలిపటాలు ఎగురేసేందుకు కేవలం కాటన్ దారాలు మాత్రమే వాడాలని, చైనా మాంజాను వాడొద్దని కోరారు.  చైనా మాంజా అమ్మినా, నిల్వ, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్​అరణ్యభవన్ లో చైనా మాంజాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, పక్షులను రక్షించాలనే నినాదంతో అటవీ శాఖ అధికారులు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డోబ్రియాల్ మాట్లాడారు. సంక్రాంతి పర్యావరణహితంగా జరుపుకోవాల్సిన పండుగ అని, చైనా మాంజా వినియోగంతో మూగజీవాలు, పక్షులు ఆ దారాలకు చిక్కుకుని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సీజన్ లో నిఘా కోసం ప్రత్యేకంగా ఐదు టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. 

ఎవరైనా  చైనా మాంజా విక్రయిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్లు 040– 23231440, 1800 4255 364కు  వివరాలను తెలియజేయాలని కోరారు. చైనా మాంజా అమ్మినా, నిల్వ, రవాణా చేసినా ఐదేండ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా ఉంటుందన్నారు. మనుషులు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏండ్ల దాకా జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కొన్నేండ్లుగా రూ.28 లక్షల విలువైన1,391 కిలోల చైనా మాంజాను సీజ్ చేశామని వివరించారు. చైనా మాంజాను రవాణా చేస్తే వాహనాలు కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తెలంగాణలో  చైనా మాంజా వినియోగాన్ని నిషేధించామని వెల్లడించారు.