- బాచారంలో స్థలాన్ని పరిశీలించిన పీసీసీఎఫ్
బాచారం(నాగర్‌కర్నూల్), వెలుగు: నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని నాలుగు చెంచుపెంటలను మైదాన ప్రాంతానికి తరలించి, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పీసీసీఎఫ్(కంపా) సువర్ణ తెలిపారు. పెద్దకొత్తపల్లి మండలం బాచారం అటవీ ప్రాంతం సమీపంలోని ఏటీఆర్ కోర్ ఏరియాలోని కుడిచింతల బైలు, సార్లపల్లి, తాటిగుండాల, కొల్లంపెంట పునరావాసం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఏటీఆర్‌లోని పులులను సంరక్షించడంలో భాగంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో కోర్, నాన్ కోర్ ఏరియాలోని జనవాసాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ప్రతిపాదించారు.
పునరావాస ప్యాకేజీకి నాలుగు పెంటల ప్రజలు అంగీకరించారు. మొదటి విడతలో నల్లమల నుంచి బయటకు వచ్చేందుకు అంగీకరించిన వారికి బాచారం సమీపంలో పునరావాసం కల్పించేందుకు అనుకూలంగా ఉండడంతో ఆ స్థలాన్ని పరిశీలించినట్లు పీసీసీఎఫ్ తెలిపారు. పునరావాస ప్యాకేజీలో భాగంగా 5 ఎకరాల సాగు భూమి, 250 గజాల ఇంటి స్థలం, ఒక్కో కుటుంబానికి రూ.15లక్షల ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే 1501.88 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ శాఖకు బదలాయించామని చెప్పారు.
సమగ్ర నివేదికలు రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామన్నారు. అనంతరం సోమశిల ప్రాంతాన్ని సందర్శించారు. టూరిజం కాటేజీలు, కృష్ణా బ్యాక్ వాటర్, అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. సోమశిల సహజ సిద్దమైన ఎకో టూరిజం స్పాట్‌గా ఉందని, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆమె వెంట ఎఫ్డీపీటీ సీఎఫ్ రాంబాబు, డీఎఫ్‌వో రోహిత్ గోపిడి, ఎఫ్డీవోలు తిరుమల్‌రావు, రామ్మోహన్, రామ్మూర్తి ఉన్నారు.