- బీఆర్ఎస్ ఎదురుదాడిని తిప్పికొడతాం: మహేశ్ కుమార్ గౌడ్
- పీసీసీ చీఫ్‌గా రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు తీస్కుంటా
- త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని వెల్లడి
- సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన పీసీసీ కొత్త చీఫ్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడమే తన ముందు ఉన్న పెద్ద టాస్క్ అని పీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్చెప్పారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎదురుదాడిని ఎప్పటికప్పుడు తిప్పికొడతామన్నారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటానని, త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామన్నారు. శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో నిర్వహించిన వినాయక పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన హైకమాండ్ కు, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, పని చేసిన వాళ్లకు పదవులు వస్తాయనేందుకు తానే నిదర్శనమన్నారు. పీసీసీ చీఫ్ పదవికి పోటీ ఉన్నప్పటికీ, బీసీ నేతకే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినందున తనకు ఈ అవకాశం దక్కిందన్నారు.
పీసీసీ పదవికి పోటీ పడిన నేతలను కూడా కలుపుకొని వెళతానని తెలిపారు. పార్టీ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ తనకు పెద్దన్న వంటివారని, ఆయనకు ఏఐసీసీలో పదవి వస్తుందన్నారు. తన స్థాయి పీసీసీ లెవల్ మాత్రమే అయినందున ఇక్కడ చాన్స్ ఇచ్చారని చెప్పారు. పార్టీని సమర్థంగా ముందుకు నడిపిస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు క్యాడర్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తానన్నారు. కాగా, ప్రజా భవన్ కు వెళ్లి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా మహేశ్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కూడా ఉన్నారు.
గాంధీ భవన్ లో చవితి వేడుకలు
గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పార్టీ నేతలు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, పార్టీ నేతలు కుమార్ రావు, మెట్టు సాయి, ప్రీతమ్, ఇతర నేతలు పాల్గొన్నారు.