
- నిజాం టైంలో గుర్రాల పెంపకమే వృత్తి
- తర్వాత ఉపాధి లేక గుడుంబా, గంజాయి సేల్స్
- కొరకరాని కొయ్యగా మారడంతో ‘పీడీ’ అస్త్రం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గంజాయి డాన్ అంగూరు బాయిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసినా బెయిల్ పై వచ్చి మళ్లీ గంజాయి దందా చేస్తుండడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లను చంచల్‌గూడ జైలులోని అంగూరు బాయికి ధూల్‌పేట సీఐ మధుబాబు మంగళవారం అందజేశారు. ఆమెపై ధూల్‌పేట, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, గౌరారం ఎక్సైజ్స్టేషన్లలో 17, మరో 13 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
కోట్లకు పడగలెత్తిన అంగూరు బాయి
నిజాం కాలంలో లోధా కమ్యూనిటీకి చెందిన అంగూరు బాయి పూర్వీకులు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకి వలస వచ్చారు. వీరు మొదట్లో నిజాం సంస్థానంలోకి కావాల్సిన గుర్రాలను పెంచేవారు. ఇండియన్యూనియన్లో నిజాం సంస్థానం విలీనమైన తర్వాత ఉపాధి లేక నాటు సారా, గుడుంబా అమ్మడం మొదలుపెట్టారు.
తెలంగాణ వచ్చాక ప్రభుత్వాలు కట్టడి చేయడంతో అంగూరు బాయి కుటుంబం గంజాయి వ్యాపారం మొదలుపెట్టింది. కుటుంబంలో పది మంది ఉండగా ఒక్కొక్కరిపై పది కేసులున్నాయి. గంజాయి స్మగ్లింగ్‌తో అంగూరుబాయి కోట్ల రూపాయలను గడించింది.
ఎక్సైజ్‌పోలీసులు వేటాడడంతో తన మకాంను ధూల్‌పేట నుంచి నగరంలోనే వేరే చోటికి మార్చింది. అయినా దందా ఆపలేదు. ఎక్సైజ్పోలీసులకు చిక్కకుండా గంజాయి స్మగ్లింగ్చేస్తూ వాంటెడ్‌గా మారిన అంగూరు బాయి గత ఏడాది డిసెంబర్12న వేరే రాష్ట్రం నుంచి సిటీకి కారులో గంజాయి తరలిస్తూ చిక్కింది. అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.