నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్

రైతుల ఫిర్యాదుల కోసం టోల్‍ ఫ్రీ నంబర్‍: 72888 94714
    వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా, కలెక్టర్‍ ప్రావీణ్య

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలో నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్​తదితర కేసులు పెడ్తామని సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా, వరంగల్‍ కలెక్టర్‍ ప్రావీణ్య హెచ్చరించారు. శుక్రవారం వరంగల్‍ కలెక్టరేట్‍లో జిల్లాలోని విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రైతులకు విత్తనాల విక్రయించే క్రమంలో డీలర్లు సహకరించాలని కోరారు. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.  అనుమతిలేని విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అగ్రికల్చర్‍, పోలీస్‍, రెవెన్యూ ఆఫీసర్లతో టాస్క్​ఫోర్స్​ బృందాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​తెలిపారు.
వరంగల్‍ జిల్లాలో విత్తనాల కొరత లేదు..


వరంగల్‍ జిల్లాలో విత్తనాల కొరత లేదని కలెక్టర్‍ ప్రావీణ్య తెలిపారు. జిల్లాకు 3 లక్షల 50 వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరముంటే, 5 లక్షల 25 వేల ప్యాకెట్లు డీలర్ల ద్వారా దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది వానాకాలంలో లక్షా 5 వేల ఎకరాల్లో వరి, లక్షా 28 వేల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 15 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగుచేసే అవకాశమున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎవరైన నకిలీ విత్తనాలు, లూజ్‍ సీడ్‍ అమ్మినా.. రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇందుకోసం కలెక్టరేట్​కంట్రోల్‍ రూంలో 72888 94714 ఏర్పాటు చేశామన్నారు. ప్రతి డీలర్‍ షాపు వద్ద మొబైల్‍ నంబర్‍ ప్రదర్శించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కార్యక్రమంలో అగ్రికల్చర్‍ ఆఫీసర్‍ ఉషాదయాల్, అడిషనల్‍ కలెక్టర్‍ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.