పెట్రోలు దాడి ఘటనలో పోలీసు శాఖ కఠిన చర్యలు
వరంగల్, వెలుగు : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తే పీడీ యాక్టు ప్రయోగిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ వెల్లడించారు. పెట్రోలు దాడి ఘటనతో ప్రేమ పేరుతో వేధించే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలకు ఉపక్రమిం చింది. అందులో భాగంగా దర్గా కాజీపేట ప్రాంతానికి చెందిన బానోత్ రాకేశ్ పై వరంగల్ సీపీ గురువారం పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేశారు. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వు లను కాజీపేట స్టేషన్ ఇన్ స్పెక్టర్ సీహెచ్ అజయ్ సెంట్రల్జైల్లో నిందితుడికి జైలర్ సమక్షంలో పీడీ నిర్బంద ఉత్తర్వులను అందజేశారు. నిందితుడు బానోత్ రాకేశ్ కాజీపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అమ్మాయిలను ప్రేమ పేరుతో, మహిళలను లైంగింకంగా వేధించేవాడు.
ఇందులో భాగంగానే 2018 నవంబర్ 11వ తేదిన కాలేజీ అమ్మాయిని ప్రేమించాలని వెంటబడి వేధించాడు. భాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన కాజీపేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇద్దరు కాలేజీ అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించిన ఘటనతో పాటు, మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలు ఉన్నాయి. నిందితుడిపై కాజీపేట, హన్మకొండ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో పీడీ యాక్టు ప్రయోగించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ..ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడితే కోర్టులో నిరూపించి శిక్షపడే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మాయిలు మౌనంగా ఉండకుండా తమ సమస్యను పోలీస్ ఆఫీసర్లకు గానీ.. తమ తల్లిదండ్రుల దృష్టికి గానీ తీసుకువెళ్లాలని సూచించారు. ఫిర్యాదు అందితే చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.