గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్నపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. శేషన్నను అరెస్ట్ చేసి చంచలగూడా జైలుకు తరలించారు. ఆయనపై 11 కేసులు నమోదు చేశారు. కోనపురం రాములుతో పాటు మహబూబ్ నగర్ లో ఓ కానిస్టేబుల్ హత్య కేసులో శేషన్న నిందితుడుగా ఉన్నాడు. ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా పరారీలో ఉండగా..3 నెలల క్రితం దేశీ గన్ తో పాటు 5 లైవ్ రౌండ్స్ తో పోలీసులకు దొరికాడు. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శేషన్నకు మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత నయీంతో పరిచయం ఏర్పడింది. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి సొంత గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. కబ్జాలు, కిడ్నాప్ లు, బెదిరింపులు, వసూళ్లు చేసేవారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు.