ఆహార భద్రతకు పీడీఎస్ భరోసా

కొన్నేండ్లుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం(పీడీఎస్) మొత్తం మారిపోయింది. దేశంలో ఆహార ధాన్యాల సరఫరా కోసం 1960లో ఒక ‘సంక్షేమ వ్యవస్థ’గా మొదలైన పీడీఎస్ ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంది. జాతీయ ఆహార భద్రత చట్టం–2013(ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలో ‘హక్కుల ఆధారిత ఆహార భద్రత వ్యవస్థ’గా మారింది. దేశంలోని 67 శాతం మందికి ఆహారాన్ని కేంద్రం ఒక హక్కుగా చట్టం చేయడం, లక్షిత జనాభాకు ప్రతి నెలా బియ్యం కిలో మూడు రూపాయలు, గోధుమలు కిలో రెండు రూపాయలు, కాయ ధాన్యాలు కిలో రూపాయికి అందించడం ప్రపంచంలోనే తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. దేశంలో ఆహార వ్యవస్థ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ విధానంలో ఇది ఒక కీలక విభాగంగా మారింది.

ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలోని ఈ లక్షిత ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ(టీపీడీఎస్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యవస్థగా అమలులో ఉంది. ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, కేటాయింపు, దేశంలోని ఎఫ్‌సీఐ డిపోలకు రవాణా బాధ్యతలను కేంద్రం నిర్వహిస్తోంది. అంత్యోదయ అన్న యోజన(ఏఏవై), గ్రామీణ ప్రాంతాల్లో 75%  జనాభా, పట్టణాల్లో 50 శాతం జనాభాను కవర్ చేస్తూ రూపొందించిన ప్రాధాన్యతా గృహ(పీహెచ్ హెచ్) వర్గీకరణ కింద అర్హులైన వారిని గుర్తించడం, రేషన్ కార్డుల నిర్వహణ, జారీ, చౌక ధరల దుకాణాలకు(ఎఫ్​పీఎస్) ఆహార ధాన్యాల కేటాయింపు, లబ్ధిదారులకు పంపిణీ కోసం ఎఫ్​పీఎస్​ల ముంగిటికే ఆహార ధాన్యాల చేరవేత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.

శక్తివంతమైన టెక్నాలజీతో పేదలకు భరోసా

గత కొన్నేండ్లలో ప్రత్యేకించి గత ఆరు సంవత్సరాల్లో టీపీడీఎస్ లో టెక్నాలజీ వినియోగంతో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారు. టీపీడీఎస్ కార్యకలాపాలన్నింటినీ ‘ప్రారంభం నుంచి చివరి వరకు కంప్యూటరైజ్​ చేయడం’ టీపీడీఎస్ కార్యకలాపాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం. దీంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆహార పంపిణీ వ్యవస్థ పారదర్శక ఆటోమేటెడ్ వ్యవస్థగా మారింది. ఎన్ఎఫ్ఎస్ఏ కింద 80 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా జారీ చేసిన 23.5 కోట్ల రేషన్ కార్డుల డిజిటైజ్డ్ జాబితా ఆయా రాష్ర్టాలు/యూటీల ప్రభుత్వ పోర్టల్స్ లో ప్రముఖంగా ప్రచురించారు. ఇది పారదర్శకతను, భాగస్వామ్యాన్ని పెంచింది. గిడ్డంగుల్లోని నిల్వల ఆన్ లైన్ నిర్వహణ, లోపలికి, బయటకు కదలికల పర్యవేక్షణకు అనుగుణంగా సరఫరా వ్యవస్థల కార్యకలాపాలన్నింటినీ దేశంలోని 31 రాష్ట్రాలు/యూటీలు ఆటోమేట్ చేశాయి. దీనికి తోడు 1967/1800 సీరీస్ కింద ప్రారంభించిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ , ఆన్ లైన్ లో పీడీఎస్ కు సంబంధించిన ఫిర్యాదుల చేసే సదుపాయాన్ని ప్రజలకు కల్పిస్తోంది. సబ్సిడీ ఆహార ధాన్యాలు అందరికీ చేరేలా చూసేందుకు సరైన లబ్ధిదారుల గుర్తించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. దేశంలో 90 శాతం రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేశారు. దీని వల్ల నెలవారీ కేటాయింపులో 70 శాతం ఆహార ధాన్యాలు బయోమెట్రిక్ విధానంలో దేశంలోని 4.9 లక్షల ఎలక్ర్టానిక్ పాయింట్స్ ఆఫ్ సేల్ ద్వారా పారదర్శకంగా పంపిణీ అవుతున్నాయి.

ఇంటిగ్రేటెడ్ సిస్టమ్: వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు

టెక్నాలజీ ఆధారిత విధానంలో ‘ఒక దేశం, ఒకే రేషన్ కార్డు(ఓఎన్ఓఆర్సీ) ప్రణాళిక’ కింద దేశంలో ఎక్కడైనా రేషన్ కార్డు చెల్లుబాటయ్యే, ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం కల్పించారు. ఈ సమీకృత వ్యవస్థ బయోమెట్రిక్/ఆధార్ అథెంటికేషన్ తో ఒకే రేషన్ కార్డును ఉపయోగించి దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలోని ఎఫ్ పీఎస్ నుంచైనా పీడీఎస్ ఉపయోగించుకునేలా లబ్ధిదారులకు సాధికారత చేకూర్చింది. ఈ విధానానికి శ్రీకారం చుట్టడంతో వలస కార్మికులు ఆహార భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించారు. ప్రధాని ప్రారంభించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ సంస్కరణల్లో ఇది కీలక భాగంగా మారింది. ప్రస్తుతం 30 రాష్ట్రాలు/యూటీల్లో ఈ వ్యవస్థ క్రియాశీలకంగా పని చేస్తోంది. 68.7 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం సమకూరుతోంది. జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 14445 ఈ పోర్టబులిటీని సరళం, వినియోగదారుల స్నేహపూర్వకంగా మార్చింది.

సంక్షోభంలో ప్రయోగాత్మక కార్యక్రమాలు

అర్హుడైన ఒక్క లబ్ధిదారుడు నిరాకరణకు గురికాకుండా భరోసా ఇవ్వడానికి 6 రాష్ర్టాల్లోని 6 జిల్లాల్లో -జార్ఖండ్(పాలమూ), ఉత్తరప్రదేశ్(బారాబంకి), గుజరాత్(ఛోటా ఉదేపూర్), ఆంధ్రప్రదేశ్(గుంటూరు), హిమాచల్ ప్రదేశ్(మండి), మిజోరం(హనాతియాల్) ప్రయోగాత్మకంగా కన్వర్జెన్స్ ప్రాజెక్టును ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన జీవన సారళ్యత(ఈఓఎల్) సర్వే ద్వారా అందుబాటులో ఉన్న లబ్ధిదారుల డేటాను పీడీఎస్ డేటాతో సరిపోల్చారు. అయితే ఈఓఎల్ డేటా ఆధార్ అనుసంధానం కాకపోవడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. వివిధ పథకాల ప్రయోజనాలు సరైన లబ్ధిదారులకే అందుతున్నాయా అనేది ధ్రువీకరించుకునేందుకు, అర్హత గల వారుగా గుర్తించిన లబ్ధిదారుల్లో ఒక్కరు కూడా ఇతర మంత్రిత్వ శాఖ చేపట్టిన మరో కార్యక్రమంలో లాభం పొందడంలో నిరాకరణకు గురికాకుండా నివారించేందుకు ఇది సహాయపడుతుంది. ఈ కార్యక్రమం ఆసక్తికర ఫలితాలనిచ్చింది. 61% డేటా మ్యాచ్ అయింది. ఈ విధానం మెరుగు పరచడానికి, దాన్ని బ్లాక్, పంచాయతీ, గ్రామీణ స్థాయికి  విస్తరించే కృషి జరుగుతోంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద గత జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) డేటా బేస్, ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారుల డేటాబేస్ మధ్య ఆధార్  తో అనుసంధానం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది విజయవంతమైతే డేటాబేస్ లన్నింటినీ ఏకీకృతం చేసి మాస్టర్ డేటాబేస్ రూపొందించడం సాధ్యమవుతుంది. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు సరైన లబ్ధిదారులకే చేరేలా చూడడానికి ఇది చక్కని వేదికగా నిలుస్తుంది. సమాజంలోని అట్టడుగు 67% మంది జనాభాకు లబ్ధి చేకూర్చే ఆయుష్మాన్ భారత్(పీఎం–జన్ ఆరోగ్య యోజన) లబ్ధిదారులను గుర్తించేందుకు ఎన్ఎఫ్ఎస్ఏ డేటాబేస్ ను ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ నిర్ణయించడం ఇందుకు ఉదాహరణ.

కరోనా టైమ్​లో పంపిణీకి పీడీఎస్ ఏం చేసింది?

కరోనా సంక్షోభ సమయంలో లబ్ధిదారులకు పీడీఎస్ ద్వారా ఆహార ధాన్యాల సరఫరాకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడింది. 2020 ఏప్రిల్–నవంబర్  మధ్య ఆహార ధాన్యాల పంపిణీ పరిమాణాన్ని రెట్టింపు చేసి 80 కోట్ల మందికి సరఫరా చేరేలా చూడడంలో కీలకపాత్ర పోషించింది. ఈ కాలంలో 680 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఆహార శాఖ పంపిణీ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన బహుముఖ సవాళ్ల నేపథ్యంలో ప్రకటించిన భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూనే 93% ఆహార ధాన్యాలు ప్రతి నెలా విజయవంతంగా లబ్ధిదారులకు చేర్చగలిగింది. అంతే కాదు వలస కార్మికులు/వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన వలస కార్మికులు 2.8 కోట్ల మందిలో 2.74 కోట్ల మందికి (98%) ఆత్మ నిర్భర్ భారత్ కింద ఉచిత ఆహార ధాన్యాలు కూడా పంపిణీ చేసింది.

అతి పెద్ద ఆహార భద్రతా  పథకం  తేలిగ్గా అమలు

ప్రపంచంలో ఎక్కడా మనదేశం నిర్వహిస్తున్నంత భారీ పీడీఎస్ వ్యవస్థ అమలు కావడంలేదు. కరోనా టైమ్‌లో ఈ వ్యవస్థ మరింత మెరుగుపడింది. కొన్ని లోపాలున్న ది వాస్తవమే అయినా మహమ్మారి కాలంలో ఆహార భద్రత నిర్వహణ విషయంలో భారత్ చక్కని ఉదాహరణగా నిలిచింది. శక్తివంతమైన నాయకత్వం ప్రత్యేకించి ప్రధాని ప్రదర్శించిన విజన్ ద్వారానే ఇది సాధ్యమయింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రారంభించి
81 కోట్ల మంది ప్రజలకు సంక్షోభ సమయంలో ఫ్రీగా ఆహార ధాన్యాలు 8 నెలల పాటు సరఫరా చేయడం సవాలును దీటుగా ఎదుర్కొనగల మన దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రత్యేకించి సంక్షోభ కాలంలో ఆహార ధాన్యాల నిల్వ, సరఫరా, పంపిణీ ప్రభుత్వ సామర్థ్యాలకు గీటురాయిగా నిలిచింది. లాక్ డౌన్ కాలంలో సరఫరా వ్యవస్థలో ఏ విధమైన అంతరాయాలు లేకుండా నిర్వహించడం, గతంలో కనీవినీ ఎరుగని పరిమాణంలో ఆహార ధాన్యాలు సరఫరా చేయడం, మారుమూల ప్రాంతాల్లోని చివరి లబ్ధిదారులకూ ఆహార ధాన్యాలు అందేలా చూసినందుకు పంపిణీ వ్యవస్థతో పాటుగా మన రైతులను కూడా ప్రశంసించాలి. వేలాది రైల్వే రేక్లు, ట్రక్కులు ఆహార ధాన్యాలను తరలించా యి. అసాధారణ రీతిలో మారుమూల ప్రాంతాలకు ఆహార ధాన్యాలు చేరవేయడానికి హెలికాప్టర్లు, నేవీ సర్వీసులు కూడా ఉపయోగించుకున్నారు.