పెద్దపల్లి: జిల్లాలోని మంథని పట్టణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మే 27వ తేదీ సోమవారం మంథని మున్సిపాలిటీలోని లైన్ గడ్డ, గంగాపురిలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న సుమారు 60 క్వింటళ్ళ పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
లైన్ గడ్డలో అక్రమంగా తరలించడానికి TS 12 UB 7424 నెంబర్ గల టాటా ఏసీ ట్రాలీలో పీడీఎస్ రైస్ సిద్ధంగా ఉందని, అలాగే.. గంగాపురి గ్రామంలోని ఓ మైదానంలో వేసుకున్న డేరాలో పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండు చోట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అనంతరం పట్టుకున్న బియ్యాన్ని మంథని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంథనికి చెందిన రాచర్ల రమేష్, సయ్యద్ అస్లాంలను నిందితులుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.