- తహసీల్దార్ ఆఫీస్ ఎదుట పీడీఎస్యూ ధర్నా
కామేపల్లి. వెలుగు : కామేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అనుబంధంగా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ పోస్టుమెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై శుక్రవారం కళాశాల నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ సుధాకర్ కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జి.మస్తాన్ మాట్లాడుతూ కామేపల్లిలో బాలికలకు హాస్టల్ లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉన్నప్పటికీ గర్ల్స్ అడ్మిషన్స్ ఎక్కువగా జరగడం లేదని తెలిపారు. వెంటనే కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు.
పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గాంధీ, వెంకటేశ్, నరసింహ, రవికుమార్, చందు, విద్యార్థులు పాల్గొన్నారు.