
- రౌండ్టేబుల్సమావేశంలో శాంతి చర్చల కమిటీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: ఛత్తీస్గఢ్అడవుల్లో మావోయిస్టులపై కాల్పుల విరమణ ప్రకటించి, శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ డిమాండ్ చేసింది. మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరింది. సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిటైర్డ్జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ అడ్వకేట్ బేల బాటియా, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ హాజరై మాట్లాడారు.
మావోయిస్టుల నేపంతో ఆదివాసీల జీవించే హక్కును ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణకు చేపట్టాలని కోరారు. ఛత్తీస్గఢ్మరణకాండపై ఆదివాసీ, హక్కుల సంఘాలు, పౌర, ప్రజాస్వామిక సంఘాల రిపోర్టులు ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మానవ హక్కుల పరిరక్షకులు ప్రతికార చర్యలకు భయపడకుండా చట్టపరమైన హక్కుల కోసం కృషి చేయాలని కోరారు. శాంతి చర్చలు జరపకపోవడంతో అమాయక ఆదివాసీలు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లు కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో కందిమల్ల ప్రతాపరెడ్డి, దుర్గాప్రసాద్, జంపన్న, ఆర్.వెంకట్ రెడ్డి, జి.రాములు తదితరులు పాల్గొన్నారు.