హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వస్తుండటంతో గంగమ్మ తల్లికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పూజలు చేశారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు పురానాపూల్ కమాన్ వద్ద గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, వెండి చాటలో నవరత్నాలు సమర్పించారు. మూసీ ఒడ్డున ఉన్న అమ్మవారి గుడి దగ్గర యాగం చేశారు. పురానాపూల్ దగ్గర్లోని మూసా ఖాద్రి దర్గాలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ చాదర్ సమర్పించారు. 1908లో వరదలు వచ్చినప్పుడు నిజాం రాజులు పూజలు చేశారని.. అందుకే మళ్లీ ఇప్పుడూ పూజలు చేశామని మేయర్ తెలిపారు. గంగమ్మ శాంతించాలని కోరుకున్నామని చెప్పారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.