పీకాక్​, బఫెల్లో లేక్​లు ఆ 400 ఎకరాల్లో లేవు!

పీకాక్​, బఫెల్లో లేక్​లు ఆ 400 ఎకరాల్లో లేవు!
  • రెండు లేక్​లు హెచ్​సీయూ భూముల్లోనే ఉన్నాయి!
  • నరికేసిన 1,700 చెట్లలో పర్మిషన్ తీసుకోవాల్సినవి 120 మాత్రమే
  • జింకలు, నెమళ్లు అక్కడున్న మొత్తం భూముల్లో తిరుగుతాయ్
  • కంచ గచ్చిబౌలి భూములపై సమగ్రంగా నివేదించిన అటవీ శాఖ
  • సుప్రీంకోర్టుకు మధ్యంతర రిపోర్ట్​ను ఇవ్వనున్న ఎంపవర్డ్ కమిటీ

హైదరాబాద్, వెలుగు:కంచ గచ్చిబౌలిలో భూముల్లో ఉన్నట్లు చెబుతున్న పీకాక్​, బఫెల్లో చిన్న నీటి సరస్సులు(లేక్​లు) రెండూ హెచ్​సీయూ పరిధిలోని భూముల్లోనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమిగా చెబుతున్న 400 ఎకరాలలో ఆ సరస్సులు లేవని తెలిపింది. వీటితో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. ఆ రెండు సరస్సులకు సంబంధించిన వివరాలను ఫీల్డ్ విజిట్​కు వచ్చిన సుప్రీంకోర్టు సాధికారిక​ కమిటీకి అటవీశాఖ నివేదిక ఇచ్చింది. 

ఇక జింకలు, నెమళ్లు వంటివి హెచ్​సీయూ చుట్టూ ఉన్న భూములు మొత్తం కలియతిరుగుతాయని అటవీ శాఖ వివరించింది. గతంలో ఆడపాదడపా నెమళ్లు గాయాలపాలైనట్లు, చనిపోయినట్లు హెచ్​సీయూ నుంచే తమకు సమాచారం వచ్చేదని.. దానిని అనుగుణంగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకునే వాళ్లమని తెలిపింది. ఒకవేళ వాటిని ఇంకో ప్రాంతానికి తరలించమని కోరితే ఆ ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా అటు ప్రభుత్వానికి, ఇటు హెచ్​సీయూకు తెలియజేసింది. 

ఎప్పుడూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని లేదని పేర్కొన్నది. ఇక చెట్ల తొలగింపును పరిశీలిస్తే ఇప్పటి వరకు దాదాపు 1700ల చెట్లు కొట్టివేసినట్లు గుర్తించామని.. అయితే అందలో 90 శాతంపైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేని సుబాబుల్, కంప చెట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది. వేప చెట్లు కొన్నింటిని కొట్టివేయలేదని తెలిపింది. అయితే దాదాపు 120 చెట్లకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సినవి ఉన్నాయని.. వాటిని పర్మిషనల్​ లేకుండానే తొలగించినట్లు గుర్తించామని అటవీ శాఖ నివేదించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి పెనాల్టీ వేస్తామని స్పష్టం చేసింది. 

ఇక అటవీ విషయానికి వస్తే.. అది సహజసిద్ధంగా ఏర్పడిన అడవి కూడా కాదని నివేదించింది. సహజంగా అక్కడ సాయిల్ కొండ ప్రాంతమని.. చెట్లు కూడా అక్కడ పెద్దగా పెరిగే చాన్స్ లేదని వివరించింది. దట్టంగా ఎక్కడా అటవీ ప్రాంతం లేదని.. సుబాబుల్, ఇతర కంప చెట్లతో ప్యాచ్​లు, ప్యాచ్​లుగా చెట్లు పెరిగినట్లు తెలిపింది. అయితే అక్కడ ఏర్పడిన రాక్​ ఫార్మెషన్స్​ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని ముందే చెప్పిందని అటవీ శాఖ పేర్కొన్నది. పైగా ఆ భూముల్లో నుంచే గతంలో ఐఐఐటీ, గచ్చిబౌలి స్టేడియం, టీజీఎన్​జీవో వంటి వాటికి కేటాయింపులు చేశారని.. అప్పుడు అక్కడ అలాంటి చెట్లు ఉండటంతో తీసేసి నిర్మాణాలు చేపట్టారని స్పష్టం చేసింది. 

అన్నీ పరిగణనలోకి తీసుకుంటం

అటు ప్రభుత్వం, ఇటు అటవీ శాఖ, హెచ్​సీయూ పాలకవర్గం, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి తీసుకున్న సమాచారం, ఫీల్డ్ విజిట్​లో గుర్తించిన అంశాలన్నింటితో సాధికారిక కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వనున్నట్లు తెలిసింది. సాధికారిక కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఎలాంటి వన్యప్రాణులు కంటపడలేదని తెలిసింది. అక్కడ కొట్టివేయని వేప చెట్లు కూడా ఉన్నట్లు గుర్తించింది. భూమి యాజమాన్య హక్కులతో పాటు చెట్ల కొట్టివేత, వన్యప్రాణులు అంశాలు సహా ఇతరత్రా అన్నింటిని పరిగణనలోకి తీసుకుని మధ్యంతర నివేదికను ఇవ్వనుంది.