- పీకాక్ డే ఫెస్టివల్ లో పీసీసీఎఫ్ ఈలూ సింగ్
హైదరాబాద్, వెలుగు: కేబీఆర్ పార్క్.. హైదరాబాద్ కు ప్రకృతి- పర్యావరణ నిధిలా పనిచేస్తోందని పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) ఈలూ సింగ్ చెప్పారు. ఔటర్ చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న అర్బన్ పార్కులు మరింతగా పచ్చదనం పంచుతూ పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిచడంతోపాటు, పర్యావరణ ప్రాముఖ్యతను చాటుతున్నాయన్నారు. గురువారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో పీకాక్ డే ఫెస్టివల్ జరిగింది. ఈ యేడాది ఉత్సవాలను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి తరలివచ్చిన విద్యార్థుల మధ్య అటవీ శాఖ ఘనంగా నిర్వహించింది.
స్కూల్పిల్లలకు డ్రాయింగ్, పెయిటింగ్ ఇతర పోటీలను నిర్వహించి అధికారుల చేతులమీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యుల స్నేక్ షో అలరించాయి. హైదరాబాద్ చార్మినార్ సర్కిల్ సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ విశిష్టతను కాపాడుతూనే ఇక్కడికి వచ్చే సందర్శకులు, వాకర్స్ కు తగిన సౌకర్యాలు అందిస్తామన్నారు.