కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో రైతులు దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఈ రైతు ఉద్యమం సాగుతోంది. చట్టాలపై వారికి ఉన్న అనుమానాలను తీరుస్తూ, అవసరమైతే సవరణలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతు సంఘాలతో పలు దఫాల్లో చర్చలు జరిపింది. కానీ ఏ దశలోనూ అవి ఫలించలేదు. కేంద్ర మంత్రులతో ఆరు దఫాల చర్చల తర్వాత కూడా రైతులు ‘మాకు సవరణలు వద్దు.. ఆ చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందే’ అన్న డిమాండ్ పై పట్టువీడలేదు. ప్రస్తుతం రైతు ఉద్యమం మోడీ సర్కారుకు పెద్ద అగ్ని పరీక్షగా మారింది. పరిస్థితులు చేయి దాటిపోకముందే పరిష్కారం కనుక్కోకపోతే ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. పట్టణీకరణ స్పీడ్ అందుకుని దశాబ్దాలు దాటినా.. నేటికీ భారత్ లో మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతులే బ్యాక్ బోన్. అలాంటి రైతన్నలు తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కితే.. వాళ్ల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్రం ఇటీవల తెచ్చిన మూడు చట్టాలు.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రమోషన్, ఫెసిలిటేషన్) చట్టం–2020, అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ యాక్ట్–2020, ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెండ్ మెంట్) యాక్ట్ –2020 వల్ల రైతుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ చట్టాలు వాళ్ల జీవితాలను తలకిందులు చేసేలా ఉన్నాయన్న భావనతో తమ హక్కులను కాపాడుకోవడానికి పోరాటానికి దిగారు. ఢిల్లీని చుట్టుముట్టి నిరసనలు తెలుపుతున్నారు. ఈ చట్టాలు చేసే ముందు కేంద్ర ప్రభుత్వం రైతులు, రైతుల సంఘాలతో చర్చించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలతో వాళ్లకు జరిగే మంచి ఏంటన్నది మార్చిలో ఆర్డినెన్స్ తెచ్చినప్పుడైనా వివరించి ఉంటే రైతులు అసలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో!
రైతు ఆదాయం రెట్టింపు ఎలా సాధ్యం?
కొత్త అగ్రి చట్టాలతో ఇటు రైతులు, అటు ప్రైవేట్ కంపెనీలు.. ఇద్దరికీ మేలు జరుగుతుందని కేంద్రం చెబుతోంది. కానీ ఈ చట్టాల వల్ల అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీలు (ఏపీఎంసీ) నిర్వీర్యం అయిపోవడంతో చిన్న, సన్నకారు రైతులు తమ పంటను అమ్ముకోవాలంటే ప్రైవేటు కంపెనీల దయ మీద ఆధారపడాల్సి వస్తుంది. గ్రామాలు, చిన్న పట్టణాల్లోని రైతులకు అందుబాటులో ఉండే మార్కెట్లు దెబ్బతింటే వాళ్లపై పెను ప్రభావం పడుతుంది. కార్పొరేట్ కంపెనీల తరఫున లోకల్ గా ఉండే ట్రేడర్లే కుమ్మక్కై రైతుకు ధర తగ్గించేస్తారు. పైగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటన విషయంలోనూ చట్టంలో ప్రస్తావన లేకపోవడంతో రైతులకు ఉన్న కనీస రక్షణ కొరవడి, కార్పొరేట్లకు ఇష్టారాజ్యం అయిపోతుంది. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.. ఇలాంటి విధానాలతో ఎలా సాకారమవుతుందనేది పెద్ద ప్రశ్నే. మరోవైపు కొత్త చట్టాల ద్వారా రైతుల పంటను బల్క్ గా కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేసే అవకాశం కల్పించడంతో ప్రభుత్వం ధాన్యం సేకరణ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఎఫ్‌సీఐ బఫర్ స్టాక్ అనే మాటే ఉండదు. దీంతో దేశ ఆహార భద్రతకు ముప్పు తప్పదు.
సంస్కరణలు తప్పనిసరి, కానీ..
కచ్చితంగా అగ్రికల్చర్ మార్కెట్లను సంస్కరించాల్సిందే. కానీ ఒక్కసారి గా చట్టాలు తెచ్చి కార్పొరేట్లకు గేట్లు తెరవడం కాకుండా.. ఏపీఎంసీలతో పాటు బయట మార్కెట్లను పెంచి వాటిలో ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధరకే రైతుల నుంచి సరుకు కొనేలా నిబంధన పెట్టాలి. వీటిని అన్ని పెద్ద గ్రామాలకు, చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలి. ఇలా రెండు మూడేళ్లు కొనసాగితే ప్రస్తుతం మోడీ సర్కారు అనుకుంటున్నట్లు ఓపెన్ మార్కెట్ దానికదే క్రియేట్ అవుతుంది. కానీ కొత్త చట్టాల వల్ల బయట ఎటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒకేసారి కార్పొరేట్లతో ఒప్పందాలు లాంటివి తెస్తే కంపెనీలపై కంట్రోల్ కష్టమై.. రైతుల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులతో పాటు సంబంధిత పక్షాలతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న చట్టాల స్థానంలో కొత్తవి తీసుకురావడం లేదా ఉన్నవాటిలోనే మార్పులు చేయడం ద్వారానే రైతుల పోరాటం చల్లబడుతుంది. అయితే రైతులు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడం కేంద్రానికి పెద్ద అగ్ని పరీక్ష లాంటిదే.
ముందే చర్చలు జరిపితే సమస్య ఉండేది కాదు
కొత్తగా తీసుకొచ్చిన అగ్రి చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు. ఒక వేళ అదే నిజమైతే కనీసం తమ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ను ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు. కేంద్ర కేబినెట్ నుంచి ఆ పార్టీ తప్పుకునే వరకూ వ్యవహారం ఎందుకొచ్చినట్టు? మరోవైపు, కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఇలాంటి చట్టాలనే తీసుకురావాలని అనుకుందని, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆ పార్టీ ఈ విషయాన్ని చెప్పిందని, మరి అదే పని బీజేపీ చేస్తే తప్పేంటని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు వాదిస్తున్నారు. దీనికి సాక్ష్యంగా 2006లో నాటి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ఏపీఎంసీ సంస్కరణలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తున్నారు. కానీ అందులో తప్పేముంది? ఏవైనా సంస్కరణలు లేదా కొత్త చట్టాలు తెచ్చే ముందు రాష్ట్రాలు, వాటి వల్ల ఎఫెక్ట్ పడే వర్గాలతో చర్చిస్తే మంచిదే కదా! ప్రస్తుతం అగ్రి చట్టాల విషయంలో అదే లోపించింది. మోడీ ప్రభుత్వం కూడా ముందే చర్చించి చట్టాలు తెచ్చి ఉంటే అసలు ఏ సమస్య ఉండేది కాదు.-పర్సా వెంకట్, పొలిటికల్ అనలిస్ట్.