
- కోర్టు తీర్పుతో సంత నిర్వహణపై అనుమానాలు
- రెగ్యులర్‌గా తైబజార్ వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు
- ఆరు నెలలుగా మున్సిపాలిటీకి అందని ఫీజు
వనపర్తి/పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు సంత స్థల వివాదం కొనసాగుతోంది. కోర్టు తీర్పుతో సంత నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, సంతపై ఆధారపడిన 5 వేల మంది ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. సంత జరిగే స్థలం శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి చెందినది. ఈ స్థలం విషయంలో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో కోర్టు తీర్పు పూజారులకు అనుకూలంగా రావడంతో ఆరు నెలలుగా కాంట్రాక్టర్లు సంత తాలూకు ఫీజును మున్సిపాలిటీకి చెల్లించడంలేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం..
రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూర్చే వారాంతపు సంతలో పెబ్బేరు ఒకటి. ఈ సంత ద్వారా పెబ్బేరు మున్సిపాలిటీకి ఏటా రూ.3.45 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇందులో సగం కాంట్రాక్టర్లకు దక్కుతుంది. పెబ్బేరులో ప్రతి శనివారం జరిగే వారాంతపు సంతలో పశువులు, గొర్రెలు, మేకలతో పాటు చిరు వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. పశువులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాల కోసం జిల్లాతో పాటు ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి జనం వస్తుంటారు.
ఇదీ స్థల వివాదం..
పెబ్బేరులోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల్లోని 16 ఎకరాల్లో కొన్నేండ్లుగా ప్రతి శనివారం వారాంతపు సంతను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయ స్థలాన్ని సంత జరిపేందుకు మున్సిపాలిటీకి ఇస్తే అంతే విలువైన స్థలాన్ని మరో చోట చూపిస్తామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హయాంలో సంత పరిరక్షణ సమితి పేర్కొనడంతో ఆలయ పరిరక్షణ కమిటీ అంగీకరించింది. తహసీల్దారు పేరు మీద 12.20 ఎకరాల స్థలాన్ని మార్పిడి చేశారు. అయితే ఎంతకూ స్థలం చూపకపోవడంతో వేణుగోపాలస్వామి ఆలయ పూజారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో సంతలో జరిగే క్రయవిక్రయాలకు ఎలాంటి టెండరు నిర్వహించవద్దని మున్సిపాలిటీ నిర్ణయించింది. అయినా సంతలో కాంట్రాక్టర్ల ఫీజుల వసూళ్లు ఆగడం లేదు. ఇలా ఆరు నెలలుగా కాంట్రాక్టర్లు సంతలో ఫీజు వసూలు చేస్తున్నా మున్సిపాలిటీకి జమ చేయడం లేదు.
పేరుకే ముగ్గురు కాంట్రాక్టర్లు..
గతంలో టెండర్లు నిర్వహించగా వారానికి రూ.6.36 లక్షల చొప్పున ఫీజు చెల్లించాలని నిర్ణయించారు. పెబ్బేరు మున్సిపాలిటీకి సమకూరే ఆదాయంలో వారాంతపు సంత ఫీజే అత్యధికం. వీటిని పట్టణంలో అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నారు. అలా ప్రతి వారం కాంట్రాక్టర్లు మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు. తైబజార్, పశువులు, మేకలు, గొర్రెలకు విడివిడిగా కాంట్రాక్టర్లు ఉన్నారు. అంతా కలిసి సంత రోజు వసూలు చేసిన ఫీజులో నుంచి రూ.6.36 లక్షలు మున్సిపాలిటీకి చెల్లిస్తారు.
ఫీజు కూడా నిర్ధారిత మొత్తం కాకుండా ఇష్టారీతిగా వసూలు చేస్తుండడంతో ఫీజు ఎక్కువ మొత్తమే వస్తోంది. మున్సిపాలిటీకి ఇవ్వాల్సింది పోను, వసూలైన దాంట్లో 50 శాతం వరకు గిట్టుబాటవుతుందని అంటున్నారు. పేరుకు ముగ్గురు కాంట్రాక్టర్లే ఉన్నప్పటికీ, ఒక్కో కాంట్రాక్టరు కింద సబ్ కాంట్రాక్టర్లంతా కలిపి 335 మంది వరకు ఉంటారు. వారాంతపు సంతపై ఆధారపడి వ్యాపారం చేసుకునేవారు 5 వేల మంది వరకు ఉంటారు. స్థలం వివాదంతో సంతను ఎత్తేస్తే చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోనున్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కుంటుపడే ప్రమాదం ఏర్పడింది.
త్వరలోనే పరిష్కారం..
సంత స్థలం విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేలా చూస్తాం. - తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి