నష్టపరి పరిహారం ఇచ్చాకే మా ఇళ్ల జోలికి రండి..రోడ్డు విస్తరణపై బాధితుల ఆందోళన

నష్టపరి పరిహారం ఇచ్చాకే మా ఇళ్ల జోలికి రండి..రోడ్డు విస్తరణపై బాధితుల ఆందోళన
  • అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నోళ్లకే డబుల్​ బెడ్​రూం ఇళ్లు
  • వనపర్తిలో నాటకీయ పరిణామాల మధ్య ఆందోళన విరమణ

పెబ్బేరు, వెలుగు: మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారని, నష్టపరిహారం ఇచ్చాకే తమ ఇళ్ల జోలికి రావాలని వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో బాధితులు డిమాండ్​ చేశారు. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులపై రోజుకో వివాదం తలెత్తుతున్నది. ఇప్పటి వరకు కూలగొట్టిన ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదని, డబుల్​ బెడ్​రూం ఇల్లు కూడా మంజూరు చేయలేదని బాధితులు  ఫైర్​ అయ్యారు. దీంతో బుధవారం పోలీస్​స్టేషన్​ వద్ద జేసీబీతో ఇళ్లు కూల్చేయడానికి వెళ్లగా బాధితులు అడ్డుకున్నారు. 

ఒక బాధితుడు పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడికి వెళ్లిన మున్సిపల్​ కమిషనర్​ ఆదిశేషుపై ఆ పెట్రోల్   పడింది. ఎంత సముదాయినంచినా బాధితులు ఆందోళన ఆపలేదు. వెంటనే వనపర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి గంట పాటు ధర్నా చేశారు. అదేవిధంగా మంగళవారం జరిగిన డబుల్​ బెడ్రూం ఇళ్ల పంపిణీలోనూ అవకతవకలు జరిగాయని బాధితులు వాపోయారు. 

బీఆర్ఎస్​ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే అధికంగా ఇళ్లు మంజూరు చేశారని,  అధికార పార్టీ నేతలు, అధికారులు అంతా కుమ్మక్కై లక్కీ డిప్​ తీశారన్నారు. దాంతో చాలా మంది అర్హులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు జరిగిన  కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మున్సిపల్​ వైస్​ చైర్మన్​ కర్రె స్వామి, పోలీసులు జోక్యం చేసుకొని వారితో ధర్నా విరమింపజేశారు.