- కొత్తగూడెంలోని పెద్దాసుపత్రిలో డెలివరీలకు వెళ్తే ఖమ్మం, వరంగల్ వెళ్లమంటున్రు
- స్కానింగ్, బ్లడ్ టెస్ట్‌ల కోసం ప్రయివేట్ల్యాబ్లకు వెళ్లాల్సిందే..
- కరెంట్ఉండదు.. జనరేటర్ పనిచేయదు.. రిపేర్‌లో ఇన్వర్టర్
- ఇబ్బందుల్లో గర్భిణులు.. ఉన్నతాధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని పెద్దాసుపత్రి(ఎంసీహెచ్)లో డెలివరీ కోసం వెళ్తే పొమ్మన్నారు. అర్జెంట్‌గా ఖమ్మం, వరంగల్ వెళ్లకపోతే తల్లీబిడ్డకు ప్రాణాపాయం అని ఎంసీహెచ్ డాక్టర్లు ఖరాఖండిగా చెప్పారు. దీంతో డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ కుటుంబానికి మతిపోయింది. చివరకు పాల్వంచలోని గవర్నమెంట్ హాస్పిటల్ (సీహెచ్‌సీ)కు తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఎంసీహెచ్‌లో కరెంట్ లేదు. జనరేటర్ పనిచేయడం లేదు. ఆపరేషన్ థియేటర్లోని ఇన్వర్టర్ రిపేరులో ఉంది. స్కానింగ్, ఎక్స్‌రేలతో పాటు బ్లడ్ టెస్టుల కోసం ప్రైవేటుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
పేరుకే పెద్దాసుపత్రి..
జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో డెలివరీ కోసం వచ్చే గర్భిణులకు ఏదైన క్రిటికల్ ప్రాబ్లం వస్తే జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు ఆరోగ్య(ఎంసీహెచ్) కేంద్రానికి పంపిస్తారు. కానీ ఎంసీహెచ్‌కు ప్రసవాలకు వచ్చే వారిని ఖమ్మం, వరంగల్ వెళ్లమంటున్నారు. లేకపోతే ప్రయివేట్ హాస్పిటళ్లలో చూపించుకోవాలని చెబుతున్నారు, దీంతో పేరుకే పెద్దాసుపత్రి అని, సౌకర్యాలేవీ లేవని నిరుపేద గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రసవాలను ప్రోత్సహించాలని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే ఎంసీహెచ్‌లో మాత్రం డెలివరీ కోసం వచ్చే వారిని ఇతర ప్రాంతాలకు పంపిస్తుండడం గమనార్హం.
ఇదీ పరిస్థితి..
పెనగడపలో నివసిస్తున్న ప్రయివేట్ఎలక్ట్రీషియన్ సాల్మన్ఖాన్ తన భార్య నౌషీన్‌ను డెలివరీ కోసం పుట్టిల్లైన మణుగూరుకు పంపించారు. కానీ రామవరంలోని ఎంసీహెచ్‌లో ట్రీట్మెంట్తీసుకుంటున్నారు. ఈ నెల 10న డెలివరీ కోసం వెళ్తే ‘ అర్జెంట్ ఏమీ లేదు.. దసరా పండుగ తర్వాత రాండి..’ అని వారికి డాక్టర్లు సూచించారు. దీంతో నౌసీన్ ఈనెల 14న హాస్పిటల్‌కు వచ్చారు. సిజేరియన్ చేయాల్సి ఉందని, దానికి ఇంకా టైమ్ ఉందని, మరో రెండు రోజులు ఆగి రావాలని సిబ్బంది వారికి చెప్పి ఇంటికి పంపించారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయాన్నే ఎంసీహెచ్‌కు డెలివరీ కోసం నౌషీన్ వచ్చారు. స్కానింగ్ హాస్పిటల్లో లేదని సిబ్బంది చెప్పడంతో నౌషీన్ ప్రయివేట్హాస్పిటల్కు వెళ్లి రూ. 2,500 ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. రూ. 300 పెట్టి బ్లడ్ టెస్ట్ కూడా బయటే చేయించారు.
తీరా హాస్పిటల్‌కు వస్తే కరెంట్ లేదని, జనరేటర్ పనిచేయడం లేదని, ఇన్వర్టర్ రిపేర్‌లో ఉందని, దీంతో తమరు అర్జెంట్‌గా ఖమ్మం కానీ, వరంగల్ కానీ వెళ్లాలని, లేకపోతే తల్లీబిడ్డకు ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో నౌషీన్ కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. దిక్కుతోచని పరిస్థితిలో పాల్వంచలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)కు నౌషీన్తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెకు ఇన్‌టైంలో ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు.
ఇల్లెందుకు చెందిన ప్రియాంక మంగళవారం రాత్రి డెలివరీ కోసం కొత్తగూడెంలోని ఎంసీహెచ్‌కు వచ్చారు. ‘ఇక్కడ డెలివరీ చేసే పరిస్థితి లేదు. ఖమ్మం తీసుకెళ్లాలి’ అని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో అప్పు చేసి కుటుంబ సభ్యులు ఆమెను రాత్రికి రాత్రే ఖమ్మం తీసుకెళ్లారు. ఎంసీహెచ్‌కు వచ్చే గర్భిణులకు పట్టణంలోని ప్రయివేట్ హాస్పిటల్స్‌కు వెళ్లాలని సూచించడం, లేదంటే ఖమ్మం, వరంగల్‌కు వెళ్లాలని చెబతుండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దాసుపత్రిలో తగ్గుతున్న డెలివరీలు..
పట్టణం రామవరంలోని ఎంసీహెచ్‌లో నెలనెలా డెలివరీల సంఖ్య తగ్గుతోంది. రోజుకు 15 నుంచి 20 వరకు జరిగే ప్రసవాలు ప్రస్తుతం 10కి పడిపోవడం గమనార్హం. సౌకర్యాలు ఏవీ లేకపోవడంతో ప్రైవేట్‌కు కానీ, ఇతర ప్రాంతాలకు కానీ వెళ్లాల్సి వస్తుండంతో ప్రజలు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారు. మందులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. అత్యవసర సమయంలో ఉపయోగించే వెంటిలేటర్స్ కూడా సరిగా పనిచేయకపోవడంతో పేషెంట్లకు అవస్థలు తప్పడం లేదు.
కరెంట్‌సమస్య పరిష్కరిస్తాం..
ఎంసీహెచ్‌లో కరెంట్ సప్లైలో ప్రాబ్లం ఉంది. జనరేటర్ పనిచేయడం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చి రిపేర్ చేయాల్సి ఉంది. ఎలక్ట్రిసిటీ వాళ్లు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కవ మందిని ఇతర హాస్పిటళ్లకు రెఫర్ చేస్తున్నాం. రాజ్‌కుమార్, మెడికల్కాలేజ్ప్రిన్సిపాల్, భద్రాద్రికొత్తగూడెం