బీసీ హాస్టల్​లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

  • కామారెడ్డి జిల్లా మద్నూర్  మండలంలో ఘటన

మద్నూర్ వెలుగు: కామారెడ్డి జిల్లా మద్నూర్  మండలం పెద్ద ఎక్లారా గ్రామ పంచాయితీ పరిధిలోని గేటు వద్ద గల బాలికల గురుకుల కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న వసుధ (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మంగళవారం ఉదయం తన గదిలో ఆమె ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. విషయం తెలియడంతో బిచ్కుంద మండలం మానేపూర్  గ్రామానికి చెందిన వసుధ తండ్రి గంగారంతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీకి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. వసుధ మృతికి కాలేజీ ప్రిన్సిపాలే కారణమని వారు ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వసుధ బంధువులతో మాట్లాడారు. బాన్సువాడ డీఎస్పీ, బిచ్కుంద సీఐ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. వసుధ అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో  తోటి విద్యార్థుల తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. హుటాహుటిన కాలేజీకి  వచ్చి తమ పిల్లలను ఇక్కడ చదవనివ్వమని పేర్కొంటూ ఇంటికి తీసుకెళ్లారు.