ఆళ్లపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామస్తులు లోక్సభ ఎన్నికలను బహిష్కరించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వారు గ్రామంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మా గ్రామానికి ఆళ్లపల్లి నుంచి రోడ్డు శాంక్షన్ అయినా.. ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడంలేదు.
త్రీఫేస్ కరెంటు, సెల్ ఫోన్ టవర్, పోడు భూముల విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బందులు పెడుతున్నారు. అంగన్వాడీ బిల్డింగ్, సింగారం నుంచి భూసరాయి వరకు 5 కి.మీ. రోడ్డు సౌకర్యం వంటి ప్రధాన సమస్యలు సంవత్సరాల తరబడిగా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రతి ఎన్నికల టైంలో నాయకులు ప్రచారానికి వచ్చి అన్ని పనులు చేస్తామని హామీలు ఇచ్చి.. గెలిచాక మా గ్రామ సమస్యలు గాలికి వదిలేస్తున్నారు”అని వారు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమ గ్రామ సమస్యలను పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని.. అప్పటి వరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.