భక్తిశ్రద్ధలతో చంద్రపట్నం.. ముగిసిన లింగమంతులస్వామి కల్యాణం

 భక్తిశ్రద్ధలతో చంద్రపట్నం.. ముగిసిన లింగమంతులస్వామి కల్యాణం
  • మూడో రోజు తగ్గని భక్తుల రద్దీ
  • నేడు నెలవారం 

సూర్యాపేట, వెలుగు : పెద్దగట్టు జాతరలో ప్రధాన ఘట్టం మంగళవారంతో ముగిసింది. మూడో రోజు చంద్రపట్నం వేసి లింగమంతులస్వామి, మాణిక్యమ్మ కల్యాణం ఘనంగా నిర్వహించారు. దీంతో జాతరలో ప్రధాన ఘట్టం ముగిసింది. స్వామివారి కల్యాణం, చంద్రపట్నానికి చూసేందుకు యాదవ కులస్తులు, భక్తులు ఉదయం నుంచి పెద్దగట్టుకు పోటెత్తారు. పెద్దగట్టు హక్కుదారులైన మెంతనబోయిన, మున్న, గొర్ల(రెడ్డి) వంశీయులు తెచ్చిన పూజా సామగ్రి, తెల్లపిండి, పచ్చపిండి, కుంకుమలతో క్రమపద్ధతిలో దేవతామూర్తుల చిత్రాలను అచ్చుగా వేశారు. 

దానిపై పసుపు, కుంకుమ, తెల్ల పిండి వేసి అందంగా అలంకరించారు. అనంతరం లింగమంతులస్వామి విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను చంద్రపట్నంపై పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. పట్నం ముందు బైకాన్లు బియ్యంతో పోలుపోసి తమలపాకులు, కుడుకలు, పోకలు, ఖర్జూరాలు పెట్టారు. మెంతనబోయిన, మున్న, గొర్ల వంశాలకు చెందిన పెద్దలకు బైకాన్లు కంకణం కట్టి, బొట్టు అప్పగించారు. మెంతనబోయిన వారు కటార్లు, మున్న, గొర్ల వంశీయులు స్వామివారి కల్యాణం నిర్వహించారు.

అనంతరం మెంతనబోయిన వంశీయులు పూజలు చేసి కేసారం గ్రామానికి పయనమయ్యారు. చంద్రపట్నంను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నెలవారం నిర్వహించనున్నారు.