
- లింగమంతులస్వామి వారిని దర్శించుకున్న 30 లక్షల మంది
- హుండీ ఆదాయం రెట్టింపు
సూర్యాపేట, వెలుగు: దురాజ్‌పల్లి లింగమంతులస్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర గురువారంతో ముగిసింది. ఐదురోజులపాటు పెద్దగట్టు ప్రాంతం ఓ లింగ.. ఓ లింగా నామస్మరణతో మార్మోగింది. జాతర చివరిరోజు కూడా భక్తులు భారీగా తరలిరావడం విశేషం. ఐదో రోజు అమ్మవారికి బోనం సమర్పించి నైవేద్యం పెట్టారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. గొర్రె పిల్లను బలిచ్చి జాతర ప్రారంభానికి తెచ్చిన మకర తోరణాన్ని యాదవ కులపెద్దలు సూర్యాపేటలోని గొల్ల బజారుకు తరలించడంతో జాతర పరిసమాప్తం అయ్యింది.
జాతర ప్రారంభమైన మొదటి రెండు రోజులు యాదవులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాల గంపలను నెత్తినపెట్టుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. తమ కోరికలను విన్నవించుకొని జంతుబలిచ్చారు. మిగిలిన రెండురోజులు లింగమంతులస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఐదో రోజున మెంతబోయిన, మున్నా, గొర్ల వంశస్తులు స్వామివారికి చివరి సారిగా మొక్కులు చెల్లించి ఇంటి దారి పట్టారు.
భారీగా హుండీ ఆదాయం..
గురువారం లింగమంతులస్వామి జాతర ముగియడంతో ఆలయ ఆవరణలో హుండీ లెక్కింపు చేపట్టారు. గతేడాది జాతరకు రూ.25,71,294 ఆదాయం రాగా, ఈసారి రూ.31,29,686 ఆదాయం వచ్చింది. ఈసారి రూ.5,58,392 అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
30 లక్షల మంది భక్తులు దర్శనం..
ఈసారి జాతరకు సుమారు 30 లక్షల మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. వరుసగా నాలుగురోజులపాటు భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. గత జాతరలో 15 లక్షల మంది భక్తులు హాజరుకాగా, ఈసారి మరో 15 లక్షల మంది అధికంగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఐదు నిమిషాలకు 500 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జాతర చివరి రోజు కావడంతో విజయవాడ –- హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటలకొద్ది వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.