సూర్యాపేట, వెలుగు: తెలంగాణలో రెండవ పెద్ద జాతరైన పెద్దగట్టు లింగమతుల స్వామి జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్ పల్లి పెద్దగట్టు వద్ద అన్ని శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఈనెల 16 నుంచి 20 వరకు నిర్వహించే జాతరలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారని పోలీస్ సిబ్బంది పెద్దగట్టు వద్ద బందోబస్తు ఏర్పాటు పకడ్బందీగా ఉండాలని, అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని చెప్పారు.
దేవస్థానం చుట్టూ ఉన్న భూములను సేకరించి తాత్కాలిక బస్టాండ్లు, పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరెంట్ సమస్య రాకుండా.. 5 జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. భక్తులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పార్కింగ్ ప్లేస్ ల వద్ద భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల వద్ద తాగునీటి పంపులు ఏర్పాటు చేయాలన్నారు. జాతర విజయవంతానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు, లింగమంతుల స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోలబోయిన నరసయ్య యాదవ్, ఆర్డిఓ వేణుమాధవ రావు, సీసీఓ ఎల్ కిషన్, డీఎస్పీ రవికుమార్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీపీఓ నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎండోమెంట్ ఈవో కుశలయ్య పాల్గొన్నారు.